
మరిపెడ,వెలుగు: రుణమాఫీని ప్రభుత్వం ప్రకటించినా పంట రుణాల రెన్యువల్ కోసం రైతులను బ్యాంకు సిబ్బంది తీవ్ర ఇబ్బందుల కు గురి చేస్తున్నారు. లంచం ఇస్తేనే పంట రుణాలను రెన్యువల్ చేస్తున్నారు. దీంతో మరిపెడలోని ఏపీజీవీబీ బ్యాంకులో మంగళవారం రుణం రెన్యూవల్ కోసం వచ్చిన కొందరు రైతులు బ్యాంకు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. వృద్ధురాలు అయిన తన తల్లి మూడు రోజులుగా బ్యాంకు చుట్టూ తిరుగుతున్నా కనికరించలేదని తానంచర్లకు చెందిన ఓ రైతు వాపోయారు.
రెండు నుంచి ఐదువేల వరకు ముట్ట చెబితే కానీ ఫైళ్లు కదలడం లేదని ఆరోపించారు. దళారులు, ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని బ్యాంకు సిబ్బంది ఈ దందాకు తెర లేపారని రైతులు ఆరోపించారు. బ్యాంకు మేనేజర్ సంతోష్ ను వివరణ కోరగా తమ బ్యాంకులో ఎలాంటి అవకతవకలు జరగడం లేదన్నారు. రైతులందరూ ఒకేసారి రావడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు.