IPL 2024: ఐపీఎల్ తొలి మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ.. ఎవరీ జేక్ ఫ్రేజర్..?

IPL 2024: ఐపీఎల్ తొలి మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ.. ఎవరీ జేక్ ఫ్రేజర్..?

ఫ్రేజర్ మెక్‌గుర్క్.. ప్రస్తుతం ఈ పేరు మారు మ్రోగిపోతుంది. ఐపీఎల్ తొలి మ్యాచ్ లోనే జూలు విదిల్చాడు. సాధారణంగా భారత్ లాంటి పిచ్ లపై ఆడటం చాలా కష్టం. కానీ ఈ 21 ఏళ్ళ ఆసీస్ కుర్రాడు ఏ మాత్రం తడబాటు లేకుండా ఆడాడు. ఒత్తిడిలోనూ ఎటాకింగ్ చేస్తూ అర్ధ సెంచరీతో మెరిశాడు. 35 బాల్స్‌‌‌‌లో 2 ఫోర్లు, 5 సిక్స్‌‌‌‌లతో 55 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. మూడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి మెరుపులు మెరిపించాడు. దీంతో ఇప్పుడు ఈ యువ ఆటగాడు ఎవరో తెలుసుకోవాలని నెటిజన్స్ తెగ వెతికేస్తున్నారు. 

ఫ్రేజర్ మెక్‌గుర్క్ ఆస్ట్రేలియా క్రికెట్ లో కొన్ని నెలల నుంచి సంచలనంగా మారింది. ఈ  21 ఏళ్ళ క్రికెటర్ దేశవాళీ క్రికెట్ లో, బిగ్ బాష్ లీగ్ లో సత్తా చాటుతూ పాపులర్ అయ్యాడు. హ్యారీ బ్రూక్ గాయపడడంతో ఈ యువ ఆటగాడిని ఢిల్లీ క్యాపిటల్స్ ఎంపిక చేసింది. ఫ్రేజర్-మెక్‌గర్క్ ఏప్రిల్ 11, 2002న విక్టోరియాలో జన్మించాడు. పదవ సంవత్సరం వరకు కారీ బాప్టిస్ట్ గ్రామర్ స్కూల్‌కు వెళ్లి.. ఆ తర్వాత SEDA కాలేజీలో తన చివరి రెండు సంవత్సరాల పాఠశాల విద్యను పూర్తి చేశాడు. 9 సంవత్సరాల వయస్సులో బోరుందరా క్రికెట్ క్లబ్ కోసం జూనియర్ క్రికెట్ ఆడటం ప్రారంభించాడు.

మెక్‌గుర్క్ గత ఏడాది కేవ‌లం 29 బంతుల్లోనే సెంచ‌రీ చేసి చ‌రిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో లిస్ట్-ఏ (అంత‌ర్జాతీయ వ‌న్డేలు, దేశ‌వాలీ వ‌న్డే టోర్నీలు) క్రికెట్‌లో వేగ‌వంత‌మైన శ‌త‌కాన్ని న‌మోదు చేసిన ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు. మొత్తంగా 38 బంతులు ఆడిన ప్రేజ‌ర్ 10 ఫోర్లు, 13 సిక్స‌ర్ల‌తో 125 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. 2015లో లిస్ట్-ఏ క్రికెట్‌లో సౌతాఫ్రికా దిగ్గ‌జ ఆట‌గాడు ఏబీ డివిలియ‌ర్స్ పేరిట ఉన్న రికార్డును బ‌ద్ద‌లు కొట్టాడు. బిగ్ బాష్ లీగ్ లో ఓపెనర్ గా వచ్చి పరుగుల వరద పారించి.. ఆసీస్ జట్టులో స్థానం సంపాదించాడు.