
శివరాత్రి పర్వదినాన శివాలయాలు హర హర మహాదేవ శంభోశంకర అనే నామంతో మారుమోగుతాయి. రోజంతా ఓం నమ:శివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ.. దైవ చింతనతో గడుపుతారు. అర్దరాత్రి స్వామి వారి కళ్యాణం తరువాత లింగోధ్భవ సమయంలో నీలకంఠేశ్వరస్వామికి అభిషేకం చేసి భక్తులు తన్మయత్వం పొందుతారు.
పురాణాల ప్రకారం శివుడిని దేవతలే కాదు.. రాక్షసులు కూడా పూజించారు.. ఎందుకంటే చెంబుడు నీళ్లు పోసినా.. అడవిలో దొరికే బిల్వ పత్రాన్ని సమర్పించినా.. ఇట్టే కోరికలు తీరుస్తాడు కదా మరి.. ! అంతటి శివుడి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం..
శివుడు తన జఠాజూఠంలో గంగను పట్టుకొని ఉంటుంది కదా! భగీరథుడు పరలోకం నుండి గంగ కోసం వేచిచూస్తున్న సమయంలో, గంగ ఎంతో అహంకారంతో పృథ్విని నాశనం చేసేంత శక్తి గల వేగంతో వస్తానని చెబుతుంది. అప్పుడు భగీరథుడి విన్నపం మేరకు పరమశివుడు గంగను తన జఠాజూఠంలో పట్టుకుని భూమిపైకి చిన్న ధారగా గంగా నదిగా వదిలాడు. అందుకే ఆయనకు గంగాధర అనే పేరొచ్చింది.
రాక్షసుల బాధపడలేక దేవతలు చేసిన క్షీరసాగర మథనంలో పుట్టిన హాలాహలం అందరినీ నాశనం చేస్తుందన్న ఆలోచనతో శివుడు తానే ఆ విషాన్ని తన కంఠంలో ఉంచుకున్నాడు. అందుకే ఆయనకు నీలకంఠుడు అనే పేరుంది.
భక్తులకు కోరికలను తీర్చే మహాదేవుడిగా పేరున్న శివుడికి అందరు దేవుళ్లతో పోల్చితే ఇంకో ప్రత్యేకత ఉంది. ఇతర దేవతలకు ఎవరికీ లేని విధంగా శివుడికి లింగరూపం ఉంది. మహేశ్వరుడు పరబ్రహ్మ స్వరూపుడు.. ఆ పరబ్రహ్మ తన ఇచ్ఛానుసారం కొన్నిసార్లు నిరాకారుడిగానూ, కొన్నిసార్లు సాకారుడిగానూ ఉంటాడు. నిరాకారుడికి చిహ్నమే శివలింగం..
-వెలుగు,లైఫ్–