- దసరా తరువాత అసంతృప్తులతో సమావేశం
- పదవులు ఇస్తామని, పనులు చేస్తామని హామీ ఇవ్వాలని నిర్ణయించినట్లు టాక్
మహబూబ్‌నగర్, వెలుగు : రూలింగ్ పార్టీ క్యాండిడేట్లు సొంత పార్టీ లీడర్లపై నిఘా పెట్టారు. ఎవరెవరు అసంతృప్తిలో ఉన్నారు? అపోజిషన్ పార్టీల లీడర్లతో ఎవరెవరు టచ్‌లో ఉన్నారనే విషయంపై ఆరా తీస్తున్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన కొందరు లీడర్లు దసరా తరువాత అసంతృప్త లీడర్లతో సమావేశం కావాలని నిర్ణయించారు. వారితో భేటీ అయ్యేందుకు సంప్రదింపులు జరుపుతున్నారు.
అప్పుడు పక్కన పెట్టి..
2018 ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాల్లో 13 చోట్ల రూలింగ్ పార్టీ క్యాండిడేట్లు గెలుపొందారు. వీరి గెలుపులో ఎంపీటీసీలు, సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, మండల స్థాయి లీడర్లు ‘కీ’ రోల్ పోషించారు. ఎన్నికల తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా, తమ గెలుపు కోసం పని చేసిన వారిని కొందరు ఎమ్మెల్యేలు పక్కన పెట్టేశారు. ఇతర పార్టీల నుంచి వలసలను ప్రోత్సహించారు. వారికే పదవులు కట్టబెట్టారు.
పింఛన్, రైతుబీమా, ఇతర ప్రభుత్వ పథకాలు కావాలని ఈ లీడర్లు ఎమ్మెల్యేల వద్దకు వెళ్లినా ఆ పనులు చేయలేదు. పైగా కొత్తగా పార్టీలో చేరి పదవులు అనుభవిస్తున్న వారి దగ్గరికి వెళ్లాలని ఎమ్మెల్యేలు సూచించడంతో పాత లీడర్లంతా నారాజ్ అయ్యారు. అవమానాలను ఎదుర్కొన్న కొందరు లీడర్లు ఎమ్మెల్యేల తీరుపై బహిరంగంగానే విమర్శలు చేశారు. కొందరు బయటకు చెప్పుకోకపోయినా.. టైం వచ్చినప్పుడు తమ సత్తా చూపేందుకు రెడీగా ఉన్నారు. వీరంతా మండలాల్లో ఓటర్లను ప్రభావితం చేసే వారు కావడంతో ఇప్పుడు ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారు. వారితో మాట్లాడి మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు.
ఇంటెలిజెన్స్ రిపోర్ట్‌తో..
సీఎం కేసీఆర్ నిర్వహించిన సర్వేలు, ఇంటెలిజెన్స్ ఇచ్చిన రిపోర్టుల్లో ప్రభుత్వంపైనా, క్యాండిడేట్ల తీరుపై వ్యతిరేకత ఉన్నట్లు తేలింది. క్షేత్రస్థాయిలో లీడర్లు క్యాడర్‌ను పట్టించుకోకుండా గాలికొదిలేశారని, వారి పట్ల అమర్యాదకపూర్వంగా వ్యవహరిస్తున్నారని, కొందరు ఎమ్మెల్యేలు ఏకంగా పబ్లిక్‌లోనే వారిని బూతులు తిడుతున్నారనే రిపోర్టులు సీఎం వద్దకు చేరాయి. ఇదే విషయంపై ఇటీవల బీఫామ్‌లు ఇచ్చిన తర్వాత ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం ప్రస్తావించారు. ప్రతి కార్యకర్త వద్దకు వెళ్లి మాట్లాడాలని, ఎవరినీ తక్కువ చేయొద్దని మంత్రులు, ఎమ్మెల్యేలకు సూచించారు. దీంతో ఉమ్మడి జిల్లాలో ఇలాంటి ఇష్యూలు ఉన్న నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు అసంతృప్తులపై దృష్టి పెట్టారు. తమకు అత్యంత సన్నిహితులుగా పేరున్న లీడర్లను మీడియేటర్లుగా వాడుకుంటున్నారు. వారి ద్వారా అసంతృప్త లీడర్లతో చర్చలకు రావాలని పిలిపిస్తున్నారు. సీఎం కేసీఆర్ పర్యటన ముగిసిన తరువాత వారితో సమావేశం అయ్యేందుకు టైం కూడా ఫిక్స్ చేసుకుంటున్నారు. వారి డిమాండ్లు, ఇతరాత్ర విషయాలపై చర్చించనున్నట్లు సమాచారం.
అలంపూర్‌లో రచ్చ..
అలంపూర్ నియోజకవర్గంలో రూలింగ్ పార్టీ లీడర్లు రచ్చరచ్చ చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని 14 స్థానాలను సిట్టింగులకే ఇస్తున్నట్లు సీఎం ప్రకటించారు. అయితే, ఈ నెల 16న అందరికీ బీఫామ్‌లు ఇవ్వగా, అలంపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే వీఎం అబ్రహంకు ఇవ్వలేదు. ఇక్కడ క్యాడర్ రెండుగా చీలిపోగా.. ఓ వర్గం లీడర్లు ఆయనకు సపోర్ట్ చేయమని మీటింగ్ పెట్టుకొని మరీ తేల్చిచెప్పారు. కొందరు లీడర్లు మంత్రి కేటీఆర్‌ను కలిసి అబ్రహంకు బీఫామ్ ఇవ్వొద్దని కోరారు. ఈ వ్యవహారంలో అలంపూర్‌కు చెందిన ఓ ప్రముఖ లీడర్ తెర వెనుక ప్రయత్నాలు చేసినట్టు టాక్ నడస్తోంది. ఆయన వర్గానికే టికెట్ ఇప్పించే ప్రయత్నంలో అసమ్మతిని రాజేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో మరో వర్గం లీడర్లు ఇప్పుడు ఆందోళనలకు దిగుతున్నారు. రెండు రోజులుగా సిట్టింగ్‌కు మద్దతుగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. అలంపూర్, అయిజ మున్సిపల్ లీడర్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, ఇతర మండల నాయకులు అబ్రహంకు మద్దతు తెలుపుతూ ఆయనకే బీఫాం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.