- ఉన్నతాధికారులకు ఫిర్యాదు
వనపర్తి, వెలుగు : విద్యుత్ శాఖలో కొందరు కింది స్థాయి ఇంజినీర్లు, లైన్‌మన్, బిల్ రికార్డర్లు కక్కుర్తి పడుతున్నారు. వనపర్తి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ శాఖ ఆఫీసర్లు, సిబ్బంది కలిసి కాంట్రాక్టర్లు చేయాల్సిన పనులను తామే చేసి బిల్లులు తీసుకుంటున్నారు. అందుకు అగ్రిమెంట్ చేసుకున్న కాంట్రాక్టర్లను సంతకాలు చేయాలని ఉన్నతాధికారులతో సిఫారసు చేయిస్తున్నారు.
జిల్లాలోని కొత్తకోట సబ్ డివిజన్ పరిధిలో రైతులకు వ్యవసాయ కనెక్షన్లు, బిల్డింగులకు మెటీరియల్ సప్లై చేసేందుకు టెండర్లు పిలవగా, 16 పనులను ఇద్దరు కాంట్రాక్టర్లు దక్కించుకున్నారు. అందులో వనపర్తికి చెందిన ఒకరు 13 పనులు, మిగతా మూడు పాలెంకు చెందిన కాంట్రాక్టరు దక్కించుకున్నాడు. ఇంత వరకు బాగానే ఉన్నా. విద్యుత్తు శాఖ కొత్తకోట సబ్ డివిజన్ పరిధిలోని ఏఈ, లైన్‌మన్ స్థాయి ఉద్యోగులు టెండర్ నిబంధనలకు విరుద్ధంగా వేరే వారితో మెటీరియల్ సప్లై చేయించారు.
అగ్రిమెంట్ మార్చి బిల్లులు కాజేసే యత్నం..
కొత్తకోట సబ్ డివిజన్ పరిధిలో రైతులు, బిల్డింగులు కట్టిన వారికి కాంట్రాక్టర్‌తో సంబంధం లేకుండా వేరే వ్యక్తితో మెటీరియల్ సప్లై చేయించారు. ఇదిలాఉంటే టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్‌ను ఇటీవల ఓ రైతు కలిసి తన పొలంలో ట్రాన్స్ఫార్మర్ బిగించారని.. ఇంకా కొంత మెటీరియల్ ఇవ్వలేదని చెప్పాడు. దీంతో మెటీరియల్ సప్లై చేసింది ఎవరని ఆరా తీయగా డిపార్టుమెంట్ ఆఫీసర్లే చేశారని తెలిసింది.
ఆ తరువాత ఏఈ, లైన్‌మన్ సదరు కాంట్రాక్టర్‌ను కలిసి రైతులు, బిల్డింగ్ ఓనర్లకు తాము మెటీరియల్ సరఫరా చేశామని, బిల్లుల కోసం సంతకాలు చేయాలని కోరారు. అందుకు ససేమిరా అన్న కాంట్రాక్టర్.. తనకు అగ్రిమెంట్ చేసిన పనులను డిపార్టుమెంట్‌లోని వారే అక్రమంగా చేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్ఈకి ఫిర్యాదు చేశాడు.
మితిమీరుతున్న జోక్యం..
విద్యుత్ శాఖలో ఇంజినీర్లు, లైన్మన్లుగా ఉంటూ కాంట్రాక్టర్లకు దక్కిన పనులను తమ బంధువులు, బిల్ రీడింగ్ తీసే వారి పేరిట అక్రమంగా అగ్రిమెంట్ చేసి బిల్లులు కాజేస్తున్నారు. 16 పనులకు ట్రాన్స్ఫార్మర్, పోల్స్, కండెన్సర్లు, కండక్టర్లు, దిమ్మెల ఏర్పాటు, వైర్లు వంటి మెటీరియల్‌ను గత కొన్నాళ్లుగా కాంట్రాక్టర్లు సప్లై చేస్తున్నారు. ఇదిలాఉంటే డిపార్ట్మెంట్లోని కింది స్థాయి ఆఫీసర్లు కమీషన్లకు కక్కుర్తి పడి కాంట్రాక్టర్ అగ్రిమెంట్‌ను సైతం మార్చడానికి తెగించారు.
నిబంధనల ప్రకారం ఒకసారి అగ్రిమెంట్ జరిగాక దాన్ని మార్చడం సాధ్యం కాదు. కానీ, సదరు కాంట్రాక్టర్ పనులు చేయకపోవడంతో తాము వేరే వారితో పనులు చేయించామని ఉన్నతాధికారులను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. కాంట్రాక్టర్‌తో సంతకాలు చేసేలా చూడాలని ఒత్తిడి తెస్తున్నారు. కొత్తకోట, పెబ్బేరు సబ్ డివిజన్ పరిధిలో విద్యుత్ శాఖలోని కింది స్థాయి ఆఫీసర్లు కాంట్రాక్ట్ పనులు చేస్తున్నారని, వారి ఆగడాలకు కళ్లెం వేయాలని ఓ కాంట్రాక్టర్ ఎస్ఈకి ఫిర్యాదు చేశాడు.
విచారణకు ఆదేశించాం..
కాంట్రాక్టర్ ఫిర్యాదు చేసిన మాట నిజమే. పనులు ఎవరు చేశారు? కాంట్రాక్టర్‌తో సంబంధం లేకుండా వేరే వారితో చేయించాల్సిన అవసరం ఏముందనే విషయంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని డీఈని ఆదేశించాను. ఆయన ఇచ్చిన నివేదిక ప్రకారం చర్యలు తీసుకుంటాం. – రాజశేఖర్, ఎస్ఈ, వనపర్తి