యాదాద్రి జిల్లాలో.. 12 మిల్లుల్లోనే 19 వేల 757 టన్నుల వడ్లు

యాదాద్రి జిల్లాలో.. 12 మిల్లుల్లోనే  19 వేల 757 టన్నుల వడ్లు
  • సీజన్లు మారుతున్నా డెలివరీ మాత్రం పుంజుకోవడం లేదు
  • ప్రతీ సీజన్లోనూ అంతే
  • యాదాద్రిలో వానాకాలం పెండింగ్ 26 ,183 టన్నులు
  • యాసంగి పెండింగ్ 1.06 లక్షల టన్నులు
  • 14 మిల్లులో 68,430 టన్నులు

యాదాద్రి, వెలుగు : సీఎంఆర్​ డెలివరీలో కొన్ని మిల్లులు ఎక్కువగా జాప్యం చేస్తున్నాయి. యాదాద్రి జిల్లాలో పెండింగ్​లో ఉన్న సీఎంఆర్​లో ఎక్కువ శాతం ఆ మిల్లుల వద్దే ఉన్నాయి. సీజన్లు మారుతున్నా డెలివరీ ఏ మాత్రం పుంజుకోవడం లేదు. 2023 వానాకాలం, 2023-–24 యాసంగి సీజన్లలో యాదాద్రి జిల్లాలోని మిల్లర్లకు 5,35,832 టన్నుల వడ్లను సివిల్ సప్లయ్ డిపార్ట్​మెంట్​అప్పగించింది. ఈ వడ్ల విలువ రూ. 1178.83 కోట్లు ఉంటుంది. 2023 వానాకాలం సీజన్​కు సంబంధించి 47 మిల్లులకు 2,65,197 టన్నుల వడ్లు అప్పగించారు. దీంట్లో 1,77,682 టన్నుల సీఎంఆర్​ డెలివరీ చేయాల్సి ఉండగా 1,51, 499 (86 శాతం) టన్నులు  డెలివరీ చేశారు.

 ఇంకా 26,183 టన్నుల బియ్యం డెలివరీ చేయాల్సి ఉంది. 47 మంది మిల్లర్లలో 16 మంది వందశాతం సీఎంఆర్ అప్పగించారు.  2023–-24 యాసంగి సీజన్​వడ్లు 37 మిల్లులకు 2,70,635 టన్నుల వడ్లను అప్పగించారు. దీనికి సంబంధించి 1,81,325 టన్నుల సీఎంఆర్ అప్పగించాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు 74,983 టన్నులు అంటే 39 శాతం సీఎంఆర్​ డెలివరీ చేశారు. ఇంకా 1,06,342 టన్నుల బియ్యం డెలివరీ చేయాల్సి ఉంది. ఈ సీజన్​లో మూడు మిల్లులు వంద శాతం సీఎంఆర్​అప్పగించాయి. 

రా రైస్​డెలివరీ వెరీ పూర్..

రా రైస్​ విషయంలో మరీ స్లోగా అప్పగిస్తున్నారు. 2023 వానాకాలం సీజన్​లో 98,813 టన్నుల రా రైస్​ను అందించాల్సి ఉండగా, ఇప్పటివరకు 87,782 టన్నులు అందించారు. ఏడాది కావొస్తున్నా 11,300 టన్నులు ఇంకా పెండింగ్​లోనే ఉన్నాయి. 2023–-24 యాసంగి సీజన్​లో 7,865 టన్నులు రా రైస్​ అందించాల్సి ఉండగా, ఇప్పటివరకు 833 టన్నులు మాత్రమే అందించారు. ఇంకా 7032 టన్నులు పెండింగ్​లో ఉంది. 

కొన్ని మిల్లుల్లోనే ఎక్కువ పెండింగ్..

జిల్లాలోని కొన్ని మిల్లులు సీఎంఆర్​విషయంలో మరీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. కొనుగోళ్ల సమయంలో ఎక్కువ వడ్లు తీసుకుంటూ సీఎంఆర్​డెలివరీ విషయంలో స్లోగా ఉంటున్నాయి. ప్రతి సీజన్​లోనూ సీఎంఆర్​ డెలివరీ విషయంలో నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నాయి. 2023 వానాకాలం సీజన్​కు 47 మిల్లులకు సీఎంఆర్​ అప్పగించారు. ఈ సీజన్​కు సంబంధించి 26,183 టన్నుల సీఎంఆర్​పెండింగ్​లో ఉండగా, ఇందులో 12 మిల్లుల్లోనే 19,757 టన్నులు పెండింగ్​ఉంది.

 ఇందులో రైస్​మిల్లర్​అసోసియేషన్​రాష్ట్ర అధ్యక్షుడి రెండు మిల్లులకు సంబంధించి 4,507 టన్నులు పెండింగ్ లో ఉన్నాయి. 2023–-24 యాసంగి సీజన్​కు సంబంధించి 37 మిల్లుల్లో 1.06 లక్షల టన్నుల సీఎంఆర్ పెండింగ్​లో ఉంది. ఇందులో 14 మిల్లుల్లోనే 68,430 టన్నుల సీఎంఆర్​పెండింగ్​ఉంది. ఇందులో రాష్ట్ర రైస్​మిలర్ల అసోసియేషన్​అధ్యక్షుడి రెండు మిల్లుల్లో 8,869 టన్నులు పెండింగ్​లో ఉంటే.. మరో రెండు మిల్లుల్లో 16 వేల టన్నులు పెండింగ్​లో ఉండడం గమనార్హం.

అన్నింటినీ ఒకే గాటన కట్టేస్తున్నరు

సీఎంఆర్ విషయంలో కొందరు మిల్లర్లు లేట్​చేస్తున్నరు. లేట్​చేస్తున్న వారి వద్దే ఎక్కువ మొత్తంలో పెండింగ్​ ఉంటోంది. ఈ కొందరి వల్ల అందరికీ ఒకే గాటన కట్టేస్తున్నారు. - ఒక మిల్లరు