సీఎంఆర్‌‌‌‌ పక్కదారి!..మిర్యాలగూడ ఎఫ్‌సీఐ గోడౌన్‌‌కు పక్కనే దందా

  •     సన్నబియ్యంలో మిక్స్‌‌ చేసి అమ్ముతున్నరు
  •     వెహికల్స్‌‌కు జీపీఎస్ ఉన్నా ఫలితం శూన్యం
  •     అధికారుల తీరుపై అనుమానాలు

మిర్యాలగూడ, వెలుగు: ప్రభుత్వం రేషన్‌‌ షాపుల ద్వారా లబ్ధిదారులకు అందించే కస్టం మిల్లింగ్ రైస్‌‌తో కొందరు మిల్లర్లు అక్రమంగా దందా చేస్తున్నారు. మిల్లుల నుంచి ఎఫ్‌‌సీఐకి డెలివరీ చేసే క్రమంలో పక్కదారి పట్టిస్తున్నారు.  దీన్ని సన్నబియ్యంలో మిక్స్‌‌ చేసి మార్కెట్‌‌లో అమ్మేస్తున్నారు.  మిర్యాలగూడ పట్టణంలోని ఎఫ్‌‌సీఐ(భారత ఆహార సంస్థ) గోడౌన్‌‌కు కూతవేటు దూరంలోనే రేషన్ బియ్యాన్ని అన్‌‌లోడ్ చేసి.. మార్కెట్‌‌లోకి పంపిస్తున్నారు.  కాగా, సీఎంఆర్‌‌‌‌ను డెలివరీ చేసే లారీలకు జియో ట్యాగింగ్‌‌ ఉన్నా పక్కదారి పట్టడం చూస్తుంటే అధికారుల పాత్రపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

పర్యవేక్షణ లేకపోవడంతోనే.. 

ప్రభుత్వం రైతులను సేకరిస్తున్న ధాన్యాన్ని సీఎంఆర్ కింద మిల్లులకు కేటాయిస్తున్న విషయం తెలిసిందే.  మిల్లర్లు ఆ ధాన్యాన్ని మరాడించి బియ్యాన్ని ఎఫ్‌‌సీఐకి పంపిస్తారు. అక్కడి నుంచి కాంట్రాక్టర్లు ఎంఎల్ఎస్ పాయింట్లకు, ఆ తర్వాత  చౌక ధరల దుకాణాలకు తరలించి లబ్ధిదారులకు అందిస్తారు.

ఈ ప్రక్రియను సివిల్ సప్లై అధికారులు నిత్యం పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది. కానీ, అధికారులు అంటీముట్టనట్లు వ్యవహరిస్తుండడంతో మిల్లర్లు, కాంట్రాక్టర్లు అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.  రైస్ మిల్లుల నుంచి మిర్యాలగూడ ఎఫ్‌‌సీఐ గోడౌన్‌‌కు  బియ్యంలో లోడుతో వచ్చే లారీలు ముందు పక్కనే  షటర్‌‌‌‌తో ఉన్న చిన్న గోడౌన్‌‌ వద్దకు వెళ్తున్నారు. రాత్రిసమయంలో లారీకి కొన్ని బస్తాల చొప్పున దింపుకొని అందులో నిల్వ చేస్తున్నారు. తెల్లారి మార్కెట్లకు తరలిస్తున్నారు. 

లారీలకు జీపీఎస్ ఉన్నా.. 

సీఎంఆర్ ప్రక్రియలో భాగంగా బియ్యం రవాణాకు  సంబంధించి స్టేజ్–1,స్టేజ్–2 కాంట్రాక్టర్లు వాడే వెహికల్స్ (లారీలు, డీసీఎం)కు జీపీఎస్‌‌ ఏర్పాటు చేశారు.  ఈ సిస్టంతో లారీల ఎక్కడికి వెళ్తున్నాయో అధికారులకు తెలిఐసిపోతుంది. కానీ, ఎఫ్‌‌ఎసీఐ గోడౌన్‌‌కు దగ్గర్లోనే దందా జరుగుతున్నా వాళ్లు పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. రేషన్ మాఫియాతో కుమ్మక్కై ఈ దందాకు సహకరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారం కింద లారీల్లో నుంచి రేషన్ బియ్యం బస్తాలు దింపుతుండగా స్థానికులు నిలదీశారు. కానీ, వివాదం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడినట్లు సమాచారం.   

లోకల్ మార్కెట్‌‌లో సేల్స్ 

 మిల్లుల నుంచి పక్కదారి పట్టిస్తున్న రేషన్ బియ్యాన్ని పాలిషింగ్ చేసి సన్న బియ్యంలో మిక్స్‌ చేస్తున్నట్లు తెలిసింది.  ఆ తర్వాత లోకల్ మార్కెట్ లో సేల్‌ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం కేజీ సన్న బియ్యం రూ. 60, 70 వరకు పలుకుతోంది. సన్న బియ్యంలో రేషన్ బియ్యం మిక్సింగ్ చేసి అమ్ముతుండడంతో కస్టమర్లు నష్టపోతున్నారు. ఈ బియ్యంతో అన్నం వండితే మెత్తగా అవుతోందని వాపోతున్నారు. ప్రభుత్వం రేషన్‌‌ మాఫియాపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.