మిల్లర్లకు సీఎమ్మార్ ఉచ్చు..!

మిల్లర్లకు సీఎమ్మార్ ఉచ్చు..!
  • రూ.కోట్లు విలువ చేసే బియ్యం మాయం
  • లెక్కలు తీస్తున్న ఎన్​ఫోర్స్ మెంట్, సివిల్ సప్లైస్ అధికారులు
  • గడువు దాటినా సీఎమ్మార్ పూర్తి చేయని మిల్లులపై దాడులు
  • ఉమ్మడి జిల్లాలో ఆరుగురు మిలర్లపై క్రిమినల్ కేసులు

హనుమకొండ, వెలుగు: కొనుగోలు కేంద్రాల నుంచి సేకరించిన ధాన్యాన్ని మరాడించి ప్రభుత్వానికి ఇవ్వాల్సిన కస్టమ్ మిల్లింగ్ రైస్​(సీఎమ్మార్)తో కొందరు మిల్లర్లు అక్రమ దందాకు తెరలేపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కొన్ని మిల్లులు 2023-–24 సీజన్లే కాకుండా 2021–-22, 2022–-23 కు సంబంధించిన సీఎమ్మార్ కూడా ఇవ్వకపోవడం, ధాన్యం అమ్మేసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో విజిలెన్స్ అండ్ ఎన్​ఫోర్స్ మెంట్ అధికారులు రంగంలోకి దిగారు. జిల్లా సివిల్ సప్లైస్ అధికారులతో కలిసి మూడు రోజులు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మిల్లుల్లో సోదాలు నిర్వహించి, బియ్యం లెక్కలపై కూపీ లాగుతున్నారు. అక్రమాలకు పాల్పడిన మిల్లర్లపై క్రిమినల్ కేసులకు సిఫారస్ చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే ఆరుగురు మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు కాగా, మరిన్ని చోట్ల సోదాలు కొనసాగించేందుకు ఆఫీసర్లు రెడీ అవుతున్నారు.

రూ.కోట్ల విలువైన బియ్యం మాయం!

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రతీ సీజన్ లో సగటున ఆరు లక్షల టన్నులకుపైగా ధాన్యాన్ని ప్రభుత్వం రైతుల నుంచి సేకరించి, మిల్లులకు పంపిస్తోంది. ఇలా వచ్చే ధాన్యాన్ని మిల్లర్లు మరాడించి 67 శాతం కస్టమ్ మిల్లింగ్ రైస్ ను 45 రోజుల్లోనే ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది. ఉమ్మడి జిల్లాలోని కొంతమంది మిల్లర్లు ఆ ధాన్యంతో అక్రమ దందాకు తెరలేపారు. ఇటీవల విజిలెన్స్ ఎన్​ఫోర్స్​మెంట్, సివిల్ సప్లైస్ అధికారులు 2021–-22, 2022–-23 సీజన్ల నుంచి సీఎమ్మార్ ఎగవేస్తున్న మిల్లర్లపై ప్రధానంగా దృష్టి పెట్టారు. ఆ రెండేండ్లకు సంబంధించి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 30 వేల టన్నులకుపైగా సీఎమ్మార్​ రావాల్సి ఉండగా, సంబంధిత మిల్లర్లపై ప్రధానంగా ఫోకస్ పెట్టారు.

శుక్రవారం రాత్రి ఎల్కతుర్తి మండలం పెంచికలపేట శివారులో శ్రీబాలాజీ ఇండస్ట్రీస్ పై రైడ్ చేసి రూ.7.5 కోట్ల విలువైన బియ్యం మాయమైనట్లు గుర్తించారు. శనివారం ఐనవోలు మండలం పున్నేలులోని నారాయణ ఇండస్ట్రీస్ రూ.7.12 కోట్లు, కురవి మండలం మొగిలిచెర్ల నవ్య ఇండస్ట్రీస్ రూ.8.36 కోట్లు, ఇల్లంద శివారు లక్ష్మీగణపతి ఇండస్ట్రీస్​ రూ.11.21కోట్లు, కాపులకనపర్తి లోని సతీశ్ ఇండస్ట్రీస్ రూ.9.64కోట్లు, సాయి ఇండస్ట్రీస్ రూ.6.31 కోట్లు ఇవన్నీ కలిపి మొత్తం రూ.50.39 కోట్ల విలువైన 20,760 టన్నులకుపైగా ధాన్యాన్ని పక్కదారి పట్టించారని గుర్తించారు. ఈ మేరకు ఆయా మిల్లుల ఓనర్లపై క్రిమినల్ కేసులకు సిఫారస్ చేశారు. రెండు నెలల కిందట కూడా అధికారులు ఉమ్మడి జిల్లాలో తనిఖీలు నిర్వహించి, ఓ ఐదుగురిపై కేసులు నమోదు చేసినట్లు తెలిసింది. ఇదిలాఉంటే కొందరు సివిల్ సప్లైస్ ఆఫీసర్ల నిర్లక్ష్యం కారణంగానే కొందరు సీఎమ్మార్ ఎగవేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

లెక్కలు తీస్తున్న అధికారులు

రెండేండ్ల నుంచి సీఎమ్మార్ పెట్టని మిల్లర్లతోపాటు 2023-–24 వానాకాలం, యాసంగి సీజన్లకు సంబంధించిన సీఎమ్మార్ లెక్కలపైనా ఆఫీసర్లు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఈ నెల 19వ తేదీ వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2023-–24 యాసంగి సీజన్ కు సంబంధించి 72 వేల టన్నులు, వానాకాలం సీజన్ కు సంబంధించి 1.94 లక్షల టన్నుల సీఎమ్మార్ పెండింగ్ లో ఉన్నట్లు తెలిసింది. పెండింగ్ లో ఉన్న సీఎమ్మార్ విలువ సుమారు రూ.586 కోట్లకు పైగానే ఉండగా, మిల్లుల్లో వాటి నిల్వలపై ఆఫీసర్లు ఆరా తీస్తున్నారు. లెక్కల్లో తేడా వస్తే క్రిమినల్ కేసులకు సిఫారస్ చేయడంతో పాటు పెనాల్టీతో వసూలు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. దీంతో సీఎమ్మార్ ధాన్యాన్ని పక్కదారి పట్టించిన మిల్లర్ల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యాన్ని అమ్ముకుని సొమ్ము చేసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.