ఈ వీరులెవరైనా యాదికున్నరా?

పంద్రాగస్టు అనగానే కొంతమంది స్వాతంత్ర్య సమర యోధుల పేర్లే గుర్తుకు వస్తాయి.  బ్రిటిష్ వారి నుంచి దేశాన్ని విముక్తి చేయడానికి జరిగిన పోరాటాల్లో ఎంతో మంది పాల్గొన్నారు. అమరులయ్యారు. త్యాగాలకు మారుపేరుగా నిలిచిన వీరిని గుర్తు చేసుకునేవారే తక్కువ. వీరి గురించి తెలియని వారు కూడా చాలా మందే ఉంటారు.  అలాంటి పోరాట యోధుల్లో కొందరి గురించి చెప్పుకుందాం.

దొరలను ఎదిరించిన హైదరాబాదీ తుర్రెబాజ్ ఖాన్

బ్రిటిష్ పాలకులను ఎదిరించిన తొలి తరం  పోరాట యోధుడు తుర్రెబాజ్ ఖాన్. తొలి స్వాతంత్ర్య పోరాటంలో  ‘హీరో ఆఫ్ హైదరాబాద్’ గా పేరు తెచ్చుకున్న పోరాట యోధుడు. 1857 తొలి స్వాతంత్ర్య పోరాట ప్రభావం దేశమంతా పడింది. ఇందులో భాగంగా హైదరాబాద్ నివాసి తుర్రెబాజ్ ఖాన్ కూడా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా కదనరంగంలోకి దూకాడు.  ఇప్పటి కోఠీ ఉమెన్స్ కాలేజీ ప్రాంగణంలో ఉన్న  అప్పటి బ్రిటిష్ రెసిడెన్సీ పై 1857 జులై 17న ఐదువేల మందితో దాడి చేశాడు. జులై 22న తుర్రెబాజ్ ఖాన్ బందీగా పట్టుబడ్డాడు. బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకు జీవిత ఖైదు విధించింది. అండమాన్ జైల్లో ఉన్న తుర్రెబాజ్ ఖాన్ 1859 జనవరిలో  అక్కడి నుంచి తప్పించుకున్నాడు. తుర్రెబాజ్​ను ప్రాణాలతో పట్టుకున్నా లేదా ఆయన శవాన్ని అప్పగించినా ఐదు వేల రూపాయల నజరానా ప్రకటించింది నైజాం ప్రభుత్వం. 1859 జనవరి 24న బ్రిటిష్, నిజాం సైనికులు తూప్రాన్  గ్రామం పై విరుచుకుపడి తుర్రెబాజ్​ను కాల్చి చంపారు.

ఉరికొయ్యను ముద్దాడిన పీర్ అలీ ఖాన్

బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఉరికొయ్యను ముద్దాడిన  పోరాట యోధుడు మౌల్వీ పీర్ అలీ ఖాన్. 1820లో బీహార్ లో పుట్టిన పీర్ అలీ ఖాన్ 1857 పోరాటం స్ఫూర్తితో తన దళంతో దానాపూర్ సైనిక స్థావరం పై దాడి చేశాడు. దీంతో ఖాన్ దళం కోసం బ్రిటిష్  సైనికులు గాలింపు ముమ్మరం చేశారు. అలీ ఖాన్ దళానికి చెందిన 43 మందిని బ్రిటిష్ పాలకులు 1857 జులై 4 అరెస్టు చేశారు. 1857 జులై 7న పీర్ అలీ ఖాన్ ను బ్రిటిష్ సైన్యం ఉరితీసింది.

1857 తిరుగుబాటులో బహదూర్​ షా

మీర్జా అబు జాఫర్​ సిరాజుద్దీన్​ మహ్మద్​. మొఘల్​ పాలకుల్లో చివరివాడు. 1837 సెప్టెంబర్ 28న అధికారంలోకి వచ్చాడు. 1857 తిరుగుబాటు సందర్భంలో ఉద్యమకారులు ఈయన్ని దేశ చక్రవర్తిగా అంగీకరించారు. బహదూర్​ షా తిరుగుబాటు నాయకుల్లో ఒకడిగా గుర్తింపు పొందాడు. ఢిల్లీని వశపరుచుకున్న బ్రిటిష్‌వాళ్లు బహదూర్‌షాను బందీని చేసి విచారణ జరిపి ఖైదీగా రంగూన్‌కు పంపారు. బహదూర్‌షా జైల్లోనే బందీగా 1862లో కన్నుమూశాడు.

 

పేరులోనే  వీరత్వమున్న కట్టబొమ్మన్

కట్టబొమ్మన్ తమిళనాడులోని పాండ్య రాజుల వంశానికి చెందిన వాడంటారు చరిత్రకారులు. ఆయన పూర్వీకులు తెలుగువారు. వీరపాండ్యన్ 1790 ఫిబ్రవరిలో పంచాలకురిచి సామ్రాజ్యానికి రాజయ్యాడు. బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీవారి అధికారాలకు తలొగ్గలేదు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. అయితే ఆయన వ్యతిరేకులు ఇచ్చిన సమాచారంతో 1799 అక్టోబరులో బ్రిటిష్ సేనలకు పట్టుబడ్డాడు. వీరపాండ్యన్ పై రాజద్రోహం నేరం మోపి ఉరితీశారు.

తెల్లోళ్ల పైకి ఆదివాసీ బాణం బిర్సా ముండా

బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా అడవిబిడ్డలు ఎక్కుపెట్టిన తొలి బాణం బిర్సా ముండా. అప్పటి బెంగాల్ ప్రెసిడెన్సీలో 1875 నవంబరు 15న బిర్సా పుట్టాడు.ఆదివాసీల ప్రయోజనాలే ముఖ్యంగా పోరాటాలను ఉధృతం చేశాడు. దీంతో బ్రిటిష్  ప్రభుత్వం 1900 మార్చి 3న కుట్ర చేసి ఆయనను  అరెస్టు చేసి రాంచీ జైలుకు తరలించింది. జైల్లో శిక్ష అనుభవిస్తూనే బిర్సా ముండా అదే ఏడాది జూన్ 9న చనిపోయాడు. అప్పటికి ఆయన వయసు పాతికేళ్లే.

 

1857కు ముందే కత్తిదూశాడు ఉయ్యాలవాడ

సిపాయిల తిరుగుబాటుకు ముందే బ్రిటిష్ పాలకుపై కత్తి దూసిన తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఆయన రాయలసీమ ప్రాంతంలోని ఒక పాలెగార్. బ్రిటిష్ పాలకులు ప్రవేశపెట్టిన  రైత్వారీ విధానాన్ని వ్యతిరేకించాడు. ఈ విధానం వల్ల స్థానిక రైతుల ప్రయోజనాలు దెబ్బతింటాయని వాదించాడు. అయితే బ్రిటిష్ అధికారులెవరూ పట్టించుకోలేదు. ఈ పరిస్థితుల్లో  బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ తో ఆయనకు తేడాలు వచ్చాయి. 1846 నాటికి ఈ గొడవలు ఎక్కువయ్యాయి. దీంతో బ్రిటిష్ సైన్యంతో అమీతుమీ తేల్చుకోవడానికి నరసింహారెడ్డి సిద్ధపడ్డాడు. అదే ఏడాది జులై 18న కోయిలకుంట్లలోని ట్రెజరీ పై తన అనుచరులతో దాడి చేశాడు. దీంతో నరసింహారెడ్డి పై  బ్రిటిష్ సైన్యం కత్తి కట్టింది. ఆయనను పట్టుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమైంది. చివరకు నరసింహా రెడ్డి ఉన్న గుట్ట సమాచారం అందడంతో అక్కడికి పెద్ద సంఖ్యలో బ్రిటన్ సైనికులు వెళ్లి ప్రాణాలతో పట్టుకున్నారు. 1847 ఫిబ్రవరి 22న ఉయ్యాలవాడ ను బ్రిటన్ ప్రభుత్వం ఉరి తీసింది.