అవినీతి ఆఫీసర్లకు ఆదాయ వనరుగా ధరణి

అవినీతి ఆఫీసర్లకు ఆదాయ వనరుగా ధరణి
  • ప్రొహిబిటెడ్ లిస్టులో నుంచి సర్వే నంబర్లు తొలగించేందుకు లక్షల్లో డిమాండ్
  • గతంలో రెవెన్యూ ఆఫీసర్లు చేసిన తప్పులు సరి చేయాలన్నా డబ్బులు ముట్టజెప్పాల్సిందే
  • సీనియర్ అసిస్టెంట్ నుంచి ఉన్నతాధికారుల వరకు కాసులు కురిపిస్తున్న టీఎం 15, టీఎం 33 మాడ్యుళ్లు 
  • గత ఏడు నెలల్లో ఏసీబీ చిక్కిన ఆరుగురు తహసీల్దార్లు

కరీంనగర్, వెలుగు: అవినీతికి అలవాటుపడిన ఆఫీసర్లు, రెవెన్యూ సిబ్బందికి ధరణి పోర్టల్ బంగారుబాతుగా మారింది. ధరణి పోర్టల్ లోని పొరపాట్లను సరిచేసేందుకు కొందరు ఆఫీసర్లు లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నారు. వివిధ భూసమస్యల పరిష్కారానికి పోర్టల్ ద్వారా పెట్టుకున్న అప్లికేషన్లే వారికి కాసులు కురిపిస్తున్నాయి. కింది స్థాయిలో జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ మొదలు.. కలెక్టర్ ఆపై స్థాయి వరకు అవినీతి జాఢ్యం వ్యాపించించదనే ఆరోపణలున్నాయి.

తాజాగా రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి ఏసీబీ అధికారులకు పట్టుబడిన నేపథ్యంలో ధరణి పోర్టల్ వేదికగా జరుగుతున్న అవినీతి మరోసారి రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ధరణి పోర్టల్ లో ప్రధానంగా 'గ్రీవెన్స్ రిలేటింగ్ టు ఇన్ క్లూజన్ ఇన్ ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ లిస్టు’పేరుతో తీసుకొచ్చిన టీఎం 15 మాడ్యుల్, పాస్ బుక్ డేటా కరెక్షన్ తీసుకొచ్చిన టీఎం 33 మాడ్యుల్ ఆఫీసర్లకు ఆదాయ వనరుగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

కాసులు కురిపిస్తున్న టీఎం 15 మాడ్యుల్ 

ధరణి పోర్టల్​కు రూపకల్పన చేసినప్పుడే రాష్ట్రంలో అసైన్డ్, వక్ఫ్, దేవాదాయ, ప్రభుత్వ భూములు కలిపి సుమారు 32 లక్షల ఎకరాలు ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ జాబితాలో చేర్చారు. ఇందులో అసైన్డ్ ల్యాండ్స్ 22 లక్షల వరకు ఉన్నాయి. ఇందులో ఫ్రీడం ఫైటర్స్, మాజీ సైనికులకు ఇచ్చిన భూములు కూడా ఉన్నాయి. ఉమ్మడి ఏపీలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఫ్రీడం ఫైటర్లు, మాజీ సైనికులకు ప్రభుత్వం అసైన్ చేసిన భూములను పదేండ్ల తర్వాత నిషేధిత జాబితా నుంచి తొలగించాల్సి ఉంది. కానీ, ధరణి పోర్టల్​లో ఆ భూములను నిషేధిత జాబితాలో చేర్చి లాక్ చేశారు. 

అలాగే వివిధ ప్రాజెక్టులు, కాల్వలు, రహదారుల కోసం భూసేకరణ చేసిన సందర్భంలో ఒక సర్వే నంబర్ లో కొంత భూమిని సేకరిస్తే మొత్తం సర్వే నంబర్ నే ధరణిలో ప్రొహిబిటెడ్ లిస్టులో చేర్చారు. దీంతో భూసేకరణలో పోగా మిగిలిన పట్టా భూములను వాటి యజమానులు అమ్ముకోలేని దుస్థితి నెలకొంది. అలాగే, కొన్ని సర్వే నంబర్లు రెవెన్యూ అధికారుల పొరపాటు వల్ల ఆ జాబితాలో చేరాయి. ఇలాంటి భూములను ఆ జాబితా నుంచి తొలగించేందుకే ప్రభుత్వం పోర్టల్ ప్రారంభమైన ఐదు నెలలకు 2021 మార్చిలో టీఎం 15 మాడ్యుల్​ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 

అప్పటి నుంచే ఆఫీసర్ల దందా షురువైంది. ఈ మాడ్యుల్ కింద సుమారు 4 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. నిషేధిత జాబితా నుంచి సర్వే నంబర్లను తొలగించేందుకు ఎకరాకు 10 లక్షల నుంచి కోటి దాకా రేటు గట్టి వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇందులో చాలా వరకు జన్యూన్ ఉన్నా.. సమస్య పరిష్కారం కోసం భూయజమానులు కూడా ఆఫీసర్లు అడిగినంత గుట్టుగా ముట్టజెప్తున్నారు. ఎలాగోలా సమస్య పరిష్కారం కావాలనే ఆలోచనతో ఎవరూ ఏసీబీని, ఇతర ఆఫీసర్లను ఆశ్రయించడం లేదు. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఇలాంటి దందాలు ఉమ్మడి రంగారెడ్డి, నల్గొండ, మెదక్ జిల్లాల్లో ఎక్కువగా సాగాయనే ఆరోపణలు ఉన్నాయి. 

ధరణి సంబంధిత పనుల్లోనే  ఏసీబీ చిక్కిన ఆరుగురు తహసీల్దార్లు.. 

గడిచిన ఏడు నెలల్లో ఆరుగురు తహసీల్దార్లు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. వీరంతా ధరణి సంబంధిత పనుల్లోనే డబ్బులు తీసుకుంటూ పట్టుబడిన వారే. వీరిలో శామీర్ పేట తహసీల్దార్ సత్యనారాయణ, కరీంనగర్ జిల్లా జమ్మికుంట తహసీల్దార్ రజిని, హనుమకొండ జిల్లా కమలాపూర్ తహసీల్దార్ మాధవి, పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ తహసీల్దార్‌‌‌‌ జాహెద్ పాషా, వనపర్తి జిల్లా గోపాల్ పేట తహసీల్దార్ శ్రీనివాసులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల డీటీ భీరవెల్లి భరణిబాబు, నిర్మల్ జిల్లా కడెం తహసీల్దార్ రాజేశ్వరి, డీటీ చిన్నయ్య ఉన్నారు.

రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లకూ వసూళ్లే..

ధరణి పోర్టల్ వచ్చాక స్లాట్ బుక్ చేసుకోవడం దగ్గరి నుంచి రిజిస్ట్రేషన్ వరకు అంతా ఆన్ లైన్ లో అయిపోతుందని, ఎవరికీ రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదని అనేక సందర్భాల్లో అప్పటి సీఎం కేసీఆర్ ప్రకటించారు. కానీ, క్షేత్ర స్థాయిలో మాత్రం ప్రతి రిజిస్ట్రేషన్​కు ఓ రేటు పెట్టి వసూలు చేస్తున్నారు. ఫామ్ వెంచర్ల ద్వారా అమ్ముతున్న ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు ఒక్కో ప్లాట్ కు రూ.10 వేల నుంచి రూ.20 వేలు వసూలు చేస్తున్నారు. 

ధరణి ద్వారా నాలా కన్వర్షన్ కోసం డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఇవ్వకుంటే ఏదో ఒక కొర్రీ పెట్టి రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు, నాలా కన్వర్షన్లు ఆపుతున్నారు. లక్షలు, కోట్ల విలువైన భూములకు సంబంధించిన వ్యవహారం కావడంతో ఎంతోకొంత ముట్టజెప్పి పనులు చేయించుకుంటున్నారు.

టీఎం 33 అప్లికేషన్లలోనూ అవినీతే.. 

భూరికార్డుల ప్రక్షాళన సమయంలో రెవెన్యూ సిబ్బంది చేసిన తప్పులు.. వారికి కాసులు కురిపిస్తున్నాయి. పాస్ బుక్ డేటా కరెక్షన్ లో పేరు మార్పు, భూమి స్వభావం మార్పు, భూమి వర్గీకరణ మార్పు, భూమి పొందిన విధాన మార్పు, ఎక్స్ టెంట్ కరెక్షన్, మిస్సింగ్ సర్వే నంబర్, నోషనల్ ఖాతా నుంచి పట్టా భూమిగా ట్రాన్స్ ఫర్ చేయడం, భూమి రకం మార్పు, నాలా నుంచి వ్యవసాయ భూమిగా మార్చడం, ధరణి కంటే ముందే గజాల్లో కొంత భూమి అమ్మి ఉంటే మార్చడం, సర్వే నంబర్ డిజిటల్ సైన్ లాంటి 11 రకాల సవరణలకు అవకాశమిచ్చారు. 

ఈ కరెక్షన్స్ కోసం రాష్ట్రంలో చాలా చోట్లా ఫైల్ మూవ్ చేసే సీనియర్ అసిస్టెంట్, ఆర్ఐలు, తహసీల్దార్లు మొదలుకుని అప్రూవల్ చేసే ఉన్నతాధికారుల వరకు వాటాల వారీగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. భూరికార్డుల ప్రక్షాళనలో రెవెన్యూ సిబ్బంది, ఆఫీసర్లు చేసిన తప్పులకు మళ్లీ రైతులే మూల్యం చెల్లించాల్సి వస్తోంది.