చెన్నూరులో కారు దిగుతున్న లీడర్లు.. ఇప్పటికే కాంగ్రెస్​లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు

  • అదే బాటలో జడ్పీ మాజీ వైస్​చైర్మన్ మూల రాజిరెడ్డి 
  • మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ ​చూపూ హస్తం వైపే!
  • బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పే యోచనలో మరికొందరు నేతలు
  • అణిచివేత ధోరణులతో విసిగిపోయామంటున్న లీడర్లు 

మంచిర్యాల, వెలుగు : మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో అధికార పార్టీకి ఎదురుగాలి మొదలైంది. సిట్టింగ్​ ఎమ్మెల్యే బాల్క సుమన్​ ఒంటెత్తు పోకడలు, వ్యవహార శైలితో విసిగిపోయిన పలువురు లీడర్లు కాంగ్రెస్  వైపు చూస్తున్నారు. ఛోటామోటా నాయకులు సైతం కారు దిగడానికి సిద్ధమవుతున్నారు. ఎమ్మెల్యే సుమన్​ సీఎం కేసీఆర్ ఫ్యామిలీకి దగ్గర అనే కారణంతో నియోజకవర్గంలో ఇష్టారీతిన నడుచుకుంటున్నారని పలువురు నేతలు ఆరోపిస్తున్నారు.

 స్థానికేతరుడైనప్పటికీ ఉద్యమకారుడు, యువ నాయకుడని ఓసారి ఎంపీగా, మరోసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గానికి ఆయన చేసిందేమీ లేదని అంటున్నారు. పైగా ఉద్యమకారులనే అవమానిస్తున్నారని, రాజకీయంగా అణచివేస్తున్నారని వాపోతున్నారు. ఆత్మగౌరవం లేనిచోట తాము ఉండలేమని వారు బహిరంగంగానే తమ అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. 

ఎక్కడి నుంచో వచ్చిన వ్యక్తి ఇక్కడ పెత్తనం చెలాయించడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. నియోజకవర్గంలో కీలకమైన ముగ్గురు లీడర్లలో ఇప్పటికే ఒకరు కాంగ్రెస్​లోకి వెళ్లగా, మరో ఇద్దరు ఆ పార్టీ వైపు చూస్తుండడం బీఆర్​ఎస్ ను కలవరపెడుతోంది. దీంతో ఈ ఎన్నికల్లో కారుకు ఎదురీత తప్పదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ఢీ అంటే ఢీ అంటున్న నల్లాల

చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు ఈసారి ఎన్నికల్లో బాల్క సుమన్ పై పోటీకి సై అంటున్నారు. తెలంగాణ ఉద్యమం నుంచి కేసీఆర్ వెంట నడిచిన ఆయన 2009, 2014 జనరల్ ఎలక్షన్స్​తో పాటు 2010 బై ఎలక్షన్ లో గెలిచారు. వరుసగా మూడుసార్లు అసెంబ్లీకి ఎన్నికై హ్యాట్రిక్  సాధించారు. 2018 ఎన్నికల్లో ఓదెలు సీటును దక్కించుకున్న బాల్క సుమన్​ చెన్నూరులో పాగా వేశారు. ఓదెలు భార్య భాగ్యలక్ష్మిని జిల్లా పరిషత్​ చైర్ పర్సన్ చేశారు. అనంతరం ఓదెలును క్రమంగా యాక్టివ్  పాలిటిక్స్ కు దూరం పెట్టారు. 

అంతేకాకుండా ఆయన కుటుంబాన్ని రాజకీయంగా ఇబ్బందులు పెట్టి అణచివేశారు. దీంతో తీవ్రంగా మనస్తాపం చెందిన నల్లాల ఓదెలు.. నిరుడు మే నెలలో కాంగ్రెస్  ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రా గాంధీ సమక్షంలో తన కుటుంబ సభ్యులతో కలిసి కాంగ్రెస్​ పార్టీలో చేరారు. అయితే, మళ్లీ నాలుగు నెలల్లోనే తిరిగి ఆయన సొంత గూటికి చేరారు. 

బాల్క సుమన్  ప్రోద్బలంతోనే ఓదెలు తిరిగి సొంత గూటికి  వచ్చారు. ఆ తర్వాత వేధింపులు, అణిచివేత మరింత పెరగడంతో  మళ్లీ తన ఫ్యామిలీతో కలిసి ఓదెల హస్తం గూటికి చేరారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్  టికెట్ ఆశావహుల్లో ఆయన ముందు వరుసలో ఉన్నారు. ఉద్యమ కాలం నుంచి ఓదెలుతో కలిసి నడిచిన పలువురు నాయకులు కూడా ఇప్పుడు ఆయన వెంట వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. 

హస్తం వైపు పురాణం చూపు

ఉమ్మడి ఆదిలాబాద్  జిల్లా స్థానిక సంస్థల మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్  కుమార్.. సుమన్ పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయనకు రెండోసారి ఎమ్మెల్సీ పదవి రాకుండా సుమన్​ అడ్డుపడ్డారని ప్రచారం జరిగింది. ఈ విషయమై పురాణం అనుచరులు అప్పట్లో బహిరంగంగానే విమర్శలు చేశారు. నియోజకవర్గంలోని తన అనుచరులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డారని సతీశ్  కోపంతో ఉన్నారు. దీనికితోడు బీఆర్ఎస్​ జిల్లా అధ్యక్ష పదవి కూడా ఆయనకు దక్కలేదు. ఈసారి మంచిర్యాల నుంచి టికెట్​ ఆశించినా నిరాశే ఎదురైంది. 

ఈ నేపథ్యంలో ఆయన కొంతకాలంగా సుమన్​తో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. బీఆర్ఎస్​ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా మొన్న మంత్రి హరీశ్​రావు చెన్నూరులో పర్యటించినపుడు పురాణం కనిపించలేదు. దీంతో ఆయన పార్టీ మారనున్నారనే ప్రచారం జోరందుకుంది. ఇదిలా ఉండగా ఎమ్మెల్యే సుమన్, ఎంపీ వెంకటేశ్  నేత మూడు రోజుల కిందట హైదరాబాద్​లో సతీశ్ ను కలిశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను పరామర్శించడానికే కలిశామని చెప్తున్నా పార్టీ మారవద్దని బుజ్జగించినట్లు తెలిసింది. 

కాంగ్రెస్​లోకి  మూల రాజిరెడ్డి గ్రూప్

చెన్నూరు నియోజకవర్గానికి చెందిన మరో కీలక నేత, జడ్పీ మాజీ వైస్​ చైర్మన్​ మూల రాజిరెడ్డికి సుమన్​తో తీవ్ర స్థాయిలో విభేదాలు ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​ అభ్యర్థిగా సుమన్​పై పోటీ చేసిన వెంకటేశ్​ నేతకు ఆయన సపోర్ట్​ చేశారు. వెంకటేశ్​ బీఆర్ఎస్​లో చేరి పెద్దపల్లి ఎంపీగా పోటీ చేయడంతో ఆయన బీఆర్ఎస్​లోకి వచ్చినా సుమన్​కు దూరంగా ఉంటున్నారు. 

కొంతకాలంగా కాంగ్రెస్​తో టచ్​లో ఉన్న రాజిరెడ్డి.. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి ద్వారా ఆ పార్టీలో చేరడానికి సిద్ధమయ్యారు. నియోజకవర్గంలోని తన అనుచరులు, మరికొందరు నాయకులతో కలిసి ఆయన త్వరలోనే హస్తం గూటికి చేరతారని ప్రచారం జరుగుతోంది. అలాగే సుమన్  అణిచివేత ధోరణలతో ఇబ్బందులు పడుతున్న చెన్నూరు, కోటపల్లి, భీమారం, జైపూర్, మందమర్రి మండలాలకు చెందిన పలువురు నాయకులు కారు దిగడం ఖాయమైనట్టు తెలుస్తోంది.