- బైకుకు రూ.60, కారుకు రూ.150 వసూలు
- దగ్గరుండి పెయిడ్ పార్కింగ్ వైపు పంపిస్తున్న పోలీసులు
బషీర్ బాగ్, వెలుగు: నాంపల్లిలో కొనసాగుతున్న నుమాయిష్అడ్డాగా కొందరు పార్కింగ్ ఫీజు దందా చేస్తున్నారు. ఫ్రీ పార్కింగ్అనుకుని వెళ్తున్న సందర్శకుల నుంచి అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారు. నుమాయిష్‌కు వచ్చే సందర్శకులకు ఫ్రీ పార్కింగ్ సౌకర్యం కల్పిస్తున్నామని ఎగ్జిబిషన్సొసైటీ, పోలీసులు చెబుతున్నప్పటికీ, తాము టెండర్లు దక్కించుకున్నామంటూ ఇంటర్ బోర్డు ఆఫీస్ పక్కనున్న ఇందిరా ప్రియదర్శిని కాలేజీలో ప్రైవేట్ పార్కింగ్ దందాను కొనసాగిస్తున్నారు.
బైకుకు రూ.60, కారుకు రూ.150 వసూలు చేస్తున్నారు. ఎగ్జిబిషన్ ఎంట్రీ ఫీజు రూ.50 అయితే.. బైక్పార్కింగ్ కు రూ.60 వసూలు చేస్తున్నారని జనం మండిపడుతున్నారు. ట్రాఫిక్ పోలీసులే ఫ్రీ పార్కింగ్ అంటూ తమను పెయిడ్పార్కింగ్ వైపు పంపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే తాము 46 రోజుల ఎగ్జిబిషన్ కోసం 16 లక్షలు చెల్లించి టెండర్ తీసుకున్నామని, అందుకే ఈ రేట్స్ నిర్ణయించామని నిర్వాహకులు దురుసుగా సమాధానం ఇస్తున్నారు. ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధులను వివరణ కోరగా, అది ప్రైవేట్పార్కింగ్ ప్లేస్ అని, సొసైటీకి, ఆ పార్కింగ్ టెండర్ తో ఎలాంటి సంబంధించి లేదని తెలిపారు. ఎగ్జిబిషన్ సొసైటీ, ట్రాఫిక్ పోలీసుల సమన్వయంతో గ్రౌండ్‌కు సమీపంలోని గృహకల్ప, గగన్ విహార్, చంద్ర విహార్, భీంరామ్ బాడా స్థలం, ఫుట్ పాత్ లతో పాటు గాంధీ భవన్ మెట్రో స్టేషన్ కింద ఉచితంగా పార్కింగ్ కల్పిస్తున్నామన్నారు.
అయితే సాయంత్రం 6 గంటల్లోపు ఈ స్థలాలు వెహికల్స్‌తో నిండిపోతున్నాయి. పోలీసులు పెయిడ్పార్కింగ్వైపు వెహికల్స్‌ను పంపిస్తున్నారు. ఫ్రీ అనుకుని అక్కడికి వెళ్తున్న సందర్శకులు అక్కడికి వెళ్లాక అడిగినంత చెల్లించాల్సి వస్తోంది. పైగా ఎగ్జిబిషన్‌గ్రౌండ్ కు ఇందిరా ప్రియదర్శిని కాలేజీ దాదాపు కిలోమీటర్ దూరంలో ఉంది. నుమాయిష్ కారణంగా నాంపల్లి పరిసరాల్లో తీవ్ర ట్రాఫిక్ జామ్ అవుతుందని, సిటీ శివారుకు తరలించాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కోరారు. ప్రభుత్వ ల్యాండ్ అయిన ఇందిరా ప్రియదర్శని కాలేజీ గ్రౌండ్లో పార్కింగ్ టెండర్ఎలా ఇస్తారని ప్రశ్నించారు.