పాపికొండల విహారయాత్ర.. నకిలీ టికెట్ల దందా!

పాపికొండల విహారయాత్ర..  నకిలీ టికెట్ల దందా!
  • భద్రాచలం కేంద్రంగా టూరిస్టుల జేబుల గుల్ల
  • రూ.950 ఉన్న టికెట్​ను రూ.2 వేలకు అంటగడుతున్న దళారులు 
  • ఇష్టారాజ్యంగా వెలుస్తున్న కౌంటర్లు
  •  ఐటీడీఏ పీవోకు టూరిస్టులు, గిరిజన సంఘాల ఫిర్యాదు 

భద్రాచలం, వెలుగు :  పాపికొండల విహారయాత్రకు వచ్చే టూరిస్టుల జేబులను కొందరు గుల్ల చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ టూరిజం పేరిట భద్రాచలం కేంద్రంగా నకిలీ టికెట్​కౌంటర్లు ఏర్పాటు చేసి జోరుగా దందా  కొనసాగిస్తున్నారు. వ్యూహాత్మకంగా టిక్కెట్లను బ్లాక్​ చేసి కృత్రిమ కొరత సృష్టించి, వారి అనుచరులతో అధిక రేట్లకు టిక్కెట్లను టూరిస్టులకు అంటగడుతున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన టూరిస్టులు ఎలాగైనా పాపికొండల అందాలను చూడాలని దిక్కుతోచని స్థితిలో ఎక్కువ రేట్లు అయినా టికెట్లను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి కల్పిస్తున్నారు. 

రామాలయం చుట్టూ అవే కౌంటర్లు.. 

భద్రాచలం శ్రీరామదివ్యక్షేత్రానికి వచ్చే టూరిస్టులు స్వామి దర్శనం అనంతరం 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏపీలోని వీఆర్​పురం మండలం పోచవరం గ్రామానికి వెళ్లి అక్కడి నుంచి గోదావరిలో లాంచీపై పాపికొండలను తిలకించేందుకు ఉత్సాహం చూపుతారు. తెలుగు రాష్ట్రాలతో పాటు పక్క రాష్ట్రాల నుంచి కూడా టూరిస్టులు వేల సంఖ్యలో వస్తున్నారు. పోచవరం నుంచి 20కి పైగా లాంచీలు నిత్యం ఈ యాత్రను నిర్వహిస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ లోనే భద్రాచలంలో ఏపీ టూరిజం అధికారికంగా ఒక కౌంటర్​ను ఏర్పాటు చేసింది. ఇక్కడే టిక్కెట్లు కొనుగోలు చేసి లాంచీల వద్దకు వెళ్తారు. కానీ బోటు యజమానులు అనధికారికంగా కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఈ తరహాలోరామాలయం చుట్టూ 10 కౌంటర్ల వరకు ఉన్నాయి. 

రూ.2 వేల వరకు వసూళ్లు.. 

పాపికొండల విహారయాత్రకు పెద్దలకు రూ.950, చిన్నారులకు రూ.750 టిక్కెట్ ఉంది. ప్రతీ శని,ఆదివారం వీకెండ్​లో టూరిస్టుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ముందుగానే టిక్కెట్లు అయిపోయాయని టూరిస్టులకు చెబుతున్నారు. ఎలాగైనా టిక్కెట్లు కావాలని టూరిస్టులే బతిమిలాడే పరిస్థితి కల్పిస్తున్నారు. అనంతరం ఒక్కో టిక్కెట్​కు రూ.2 వేల వరకు వసూళ్లు చేస్తున్నారు. ఇలా ఒక్కో బోటులో 100 మందికి పైగా టూరిస్టులను ఎక్కించుకుని తీసుకెళ్తున్నారు. 

అయితే బోటు యజమానులే ఈ కౌంటర్లను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ టూరిజం పేరుతో నడుస్తున్న కౌంటర్లపై కంప్లైంట్​ చేయాలని టూరిస్టులు ప్రయత్నిస్తే అసలు తెలంగాణ టూరిజానికి, కౌంటర్లకు ఎలాంటి సంబంధం లేదని తెలిసింది. పాపికొండల పేరుతో ఆంధ్రాలో జరిగే వ్యాపారానికి భద్రాచలంలో తెలంగాణ టూరిజం పేరు వాడుకుంటున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై గిరిజన సంఘాల నాయకులు భద్రాచలం ఐటీడీఏ పీవో బి.రాహుల్​కు ఫిర్యాదు చేశారు. 

సౌకర్యాలూ అంతంతే.. 

భద్రాచలం నుంచి పోచవరం(వీఆర్​పురం మండలం, ఆంధ్రా)కు వెళ్లిన టూరిస్టులను లాంచీల్లో పాపికొండలకు తీసుకెళ్తున్నారు. కానీ  సౌకర్యాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. లాంచీలోనే టీ, టిఫిన్​, భోజనం పెడతారు. కానీ ఉడికీ ఉడకని అన్నం, రుచి  లేని కూరలతో 
టూరిస్టులు ఇబ్బందులు పడుతున్నారు.

విచారణ చేపడుతాం..  

పాపికొండల పేరుతో భద్రాచలం కేంద్రంగా జరుగుతున్న దందా మా దృష్టికి వచ్చింది. అక్కడ ఏం జరుగుతోందో తెలుసుకుంటాం. విచారణ చేపట్టి చర్యలు చేపడుతాం.  

ఐటీడీఏ పీవో రాహుల్​