మేళ్లచెరువు, వెలుగు : నాటుసారా తయారీ కేసులో బైండోవర్ చేసేందుకు వెళ్లిన పోలీసులపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం కొత్తతండాలో శనివారం జరిగింది. కొత్తతండాకు చెందిన భూక్యా తులసీరాంపై సారా తయారీ కేసులు ఉన్నాయి. ఈ నెల 28న ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి అతడి వద్ద ఉన్న 500 కిలోల బెల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు. అప్పుడు తులసీరాం పరార్ అయ్యాడు.
శనివారం తులసీరాంను పట్టుకునేందుకు ఎక్సైజ్ ఎస్సై దివ్య నేతృత్వంలోని పోలీసులు కొత్తతండాకు వచ్చారు. వారిని గమనించిన తులసీరాం, అతడి బంధువులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తులసీరాంను అదుపులోకి తీసుకుంటుండగా ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. తులసీరాం బంధువులు పోలీసులపై దాడి చేయడమే కాకుండా, వెహికల్ అద్దాలను ధ్వంసం చేశారు.
ఎక్సైజ్ ఎస్సై దివ్య లోకల్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఇద్దరు కానిస్టేబుళ్లు అక్కడికి వచ్చారు. వారిపై కూడా తండావాసులు దాడి చేశారు. పోలీసులు వారి నుంచి తప్పించుకొని చింతలపాలెం స్టేషన్‌కు చేరుకున్నారు. ఎక్సైజ్ ఎస్సై దివ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై సైదిరెడ్డి చెప్పారు.