సూర్యాపేట కేంద్రంగా .. బెల్లం దందా

  • అమ్మకాలను శాసిస్తున్న  సిండికేట్​వ్యాపారులు 
  • కొరత ఉందని,  డబుల్​ రేటుకు  బెల్లం అమ్మకాలు
  • అడిగిన వాళ్లను బెదిరిస్తున్రు.. 

సూర్యాపేట, వెలుగు:  సూర్య పేట జిల్లా కేంద్రంగా బెల్లం దందా జోరుగా సాగుతోంది. కొందరు వ్యక్తులు సిండికేట్​గా మారి,  బెల్లం అమ్మకాలను శాసిస్తున్నారు. హైదరాబాద్​ నుంచి  లో క్వాలిటీ బెల్లం తెచ్చి..  పట్టణంలో అమ్ముతున్నారు.     సిండికేట్​గా మారిన వ్యక్తులు వ్యాపారాన్ని ఇష్టం వచ్చినట్టు చేసుకొనేందుకు ఎంతకైనావెనకాడటం లేదు.  అసలు ధర కన్నా అధికంగా ధర నిర్ణయించి అమ్ముతున్నారు. దీంతోపాటు ఇతర వ్యక్తులు పట్టణంలో బెల్లం అమ్మకూడదని బెదిరింపులకు పాల్పడుతున్నారనే  ఆరోపణలున్నాయి.  

గుడుంబా తయారికి!

  మార్కెట్ లో   క్వాలిటీ బెల్లం కేజీ రూ.30  నుంచి రూ. 40 వరకు ఉండగా సూర్యాపేట మార్కెట్ లో మాత్రం రూ. 60కి పైగా పలుకుతోంది.    బెల్లం వినియోగం కేవలం ఇంటి అవసరాలకు మాత్రమే వాడేందుకు అనుమతులు ఉన్నాయి. కానీ,  గుడుంబా తయారీకి ఉపయోగించే నల్లబెల్లం, పటికపై పూర్తి నిషేధం ఉంది. కానీ,  స్థానిక సిండికేట్​ వ్యాపారులు లో క్వాలిటీ బెల్లం తెచ్చి,  దాన్ని గుడుంబా వ్యాపారులకు కూడా  అమ్ముతున్నట్టు తెలుస్తోంది. దీంతో స్వచ్ఛమైన  బెల్లం దొరకడం లేదని, కొరత సృష్టించి ఆ లోక్వాలిటీ బెల్లాన్నే అధిక ధరలకు అమ్ముతున్నారని తెలుస్తోంది.   

 నిర్ణయాలపై నియంత్రణ .. 

 సిండికేట్ వ్యాపారులు తీసుకొచ్చిన బెల్లన్నే మార్కెట్ లో  అమ్మాలని వారు  హుకుం జారీ చేశారు.  ఎవరైనా  సిండికేట్ నిర్ణయించిన ధరకే అమ్మేలా చూస్తున్నారు.  వీటితో పాటు కేజీకి రూ.10 అసోసియేషన్ పేరుతో వ్యాపారుల నుంచి  వసూళ్లు చేస్తున్నారు.  ఇలా నాలుగేళ్లలో దాదాపు రూ.2కోట్లకు పైగా వసూళ్లు చేసిన సిండికేట్ నాయకులు,  సొంతంగా వాడుకొని వాటి లెక్కలు మాత్రం బయటపెట్టడం లేదని పలువురు వ్యాపారులు బహిరంగంగానే అంటున్నారు.  ఎవరైనా వ్యాపారులు లెక్కలపై ప్రశ్నిస్తే  వారిపై బెదిరింపులకు  పాల్పడుతున్నారని వాపోతున్నారు. 

అమ్మకాలను శాసిస్తూ.. 

నలుగురు వ్యాపారులతో  ఏర్పడిన సిండికేట్ మార్కెట్ లో బెల్లం ధర లు తగ్గకుండా  చూస్తున్నారు.  కొత్తవాళ్లు ఎవ్వరూ బెల్లం అమ్మకుండా హుకుం జారీ చేసి,  కొన్ని షాపుల వాళ్ల దగ్గర  డబ్బులు తీసుకొని వారికి అనుమతి ఇచ్చినట్టు తెలుస్తోంది.  వీరిని కాదని  ఎవరైనా వ్యాపారులు సిండికేట్ ను ఎదిరించి  బయట మార్కెట్ నుండి బెల్లం తీసుకొస్తే మాత్రం సిండికేట్ వ్యాపారులే అధికారులకు సమాచారం అందించి పట్టిస్తూ  బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇటీవల హైదరాబాద్ నుంచి ఒక వ్యాపారి బెల్లం తీసుకొచ్చి వ్యాపారం చేస్తుంటే .. అధికారులు పట్టుకున్నారు. దీని వెనక సిండికేట్​ వ్యాపారులు ఉన్నారనే  ఆరోపణలు ఉన్నాయి. 

పట్టించుకోని అధికారులు..
 
సరుకు తెప్పించడం, డబ్బులు వసూళ్లు చేయడం, ఆఫీసర్లను మచ్చిక చేసుకొని ధరను పెంచుతున్నా  అధికారులు  పట్టించుకోవడం లేదు.  దీనికి తోడు సిండికేట్ కాదని బెల్లం అమ్మే వారి సమాచారం ఇచ్చిందే తడువుగా దాడులు చేస్తున్నారని వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా సిండికేట్ అక్రమాలకు అడ్డుకట్ట వేసి సజావుగా వ్యాపారాలు జరిగేలా ఆఫీసర్లు చొరవ చూపాలని వ్యాపారస్తులు కోరుతున్నారు.