నిలోఫర్ స్థలం కబ్జా .. హాస్సిటల్​ ఎమర్జెన్సీ బిల్డింగ్, ఓల్డ్ బిల్డింగ్ స్థలం ఆక్రమణ   

నిలోఫర్ స్థలం కబ్జా .. హాస్సిటల్​ ఎమర్జెన్సీ బిల్డింగ్, ఓల్డ్ బిల్డింగ్ స్థలం ఆక్రమణ   
  • బల్దియా, రెవెన్యూ ఆఫీసర్లకు ఏడాది కిందే ఫిర్యాదు  
  • అయినా పట్టించుకోలే జాగా విలువ రూ.2 కోట్ల పైమాటే  
  • హైడ్రాను ఆశ్రయించేందుకు సిద్ధమైన సూపరింటెండెంట్​ 

హైదరాబాద్ సిటీ, వెలుగు: నగరంలోని పిల్లలకే కాకుండా రాష్ట్రంలోని చిన్నారులందరికీ వైద్యం అందిస్తూ ఆదుకుంటున్న నిలోఫర్​దవాఖాన స్థలాన్ని కొందరు ఆక్రమణదారులు కబ్జా చేశారు. అక్కడ దర్జాగా నిర్మాణాలు కూడా చేపట్టారు. ఎమర్జెన్సీ బిల్డింగ్ వెనక భాగంతో పాటు ఓల్డ్ బిల్డింగ్ లోని ధోబీఘాట్ పక్కన స్థలాన్ని కబ్జా చేసి కాంపౌండ్ వాల్ నిర్మించుకున్నారు. ఆక్రమణలు జరుగుతున్నాయంటూ సాక్షాత్తు హాస్పిటల్​అధికారులు ..గతేడాది ఆగస్టు 31న జీహెచ్ఎంసీ కమిషనర్, జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్​తో సహా ఆర్డీవో, తహసీల్దార్లకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో మెల్లి మెల్లిగా విలువైన సర్కారు స్థలం ప్రైవేట్​వ్యక్తుల పరమైంది. ఆక్రమణకు గురైన స్థలం దాదాపు 200 చదరపు గజాలు కాగా, దీని విలువ సుమారు రూ. 2 కోట్ల వరకూ ఉంటుంది.  

పార్కింగ్, హాస్టల్ కు దారి కోసం...

1250  పడకల కెపాసిటీ ఉన్న నిలోఫర్ హాస్పిటల్ కు రోజూ ఐదారు వందల వాహనాలు వచ్చి వెళ్తుంటాయి. ఇవి కాకుండా సిబ్బంది వాహనాలు కూడా ఉంటాయి. దీనివల్ల పార్కింగ్ సమస్య తీవ్రమవుతోంది. దీంతో టూవీలర్స్​ను రోడ్డుపైనే పార్క్ చేస్తున్నారు. ఎమర్జెన్సీ వెనకాల ఉన్న స్థలంలో టూ వీలర్స్ కోసం పార్కింగ్ ఏర్పాటు చేయాలని అధికారుల ప్లాన్ చేశారు. కానీ, అక్కడ ఉన్న స్థలాన్ని ఆక్రమించుకున్న కొందరు ప్రైవేట్​వ్యక్తులు నిర్మాణాలు చేయడంతో పార్కింగ్ కు అవకాశం లేకుండా పోయింది. అలాగే ఓల్డ్ బిల్డింగ్ ధోబీ ఘాట్ సమీపంలో స్థలాన్ని కూడా ఆక్రమణదారులు కబ్జా పెట్టారు. నిలోఫర్ కి సంబంధించి పీజీల కోసం హాస్టల్ ఫెసిలిటీ లేదు. పక్కనే ఉన్న నిలోఫర్ స్థలంలో కొత్తగా హాస్టల్ నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఆ హాస్టల్ కి వెళ్లేందుకు ఆక్రమించిన స్థలం అడ్డంకిగా ఉంది. ఇది తొలగించి ఆ స్థలాన్ని తిరిగి నిలోఫర్ కి  అప్పగిస్తే ఇబ్బందులు తొలగిపోతాయి.  

అప్పుడే చర్యలు తీసుకొని ఉంటే.. 

హాస్పిటల్​స్థలాన్ని కాపాడాలని బల్దియా, రెవెన్యూ, ఇతర అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోవడంతో హైడ్రాకు ఫిర్యాదులు చేయాలని హాస్పిటల్ వైద్యాధికారులు నిర్ణయించుకున్నారు. గతేడాది బల్దియా, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినప్పుడు చర్యలు తీసుకుంటే స్థలం కబ్జాకు గురయ్యేది కాదని అంటున్నారు. హైడ్రాతో అయినా తమ సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తున్నారు.