ధ్వజస్థంభ ప్రతిష్ఠలో ఉద్రిక్తత.. ఇరు వర్గాల మధ్య ఘర్షణ

అంటరానితనం.. అమానుషం.. మీది తక్కువ కులం.. మాది ఎక్కువ కులం.. మా దేవాలయానికి.. మా పూజలకు మీరు రాకూడదనే విషయం.. పూర్వకాలంలోని ముచ్చటి.  కాని ఈ యుగంలో  అందరూ సమానమే.. ఎవరికి ఇష్టం వచ్చిన గుడికి వారు వెళ్లవచ్చు.. ఎవరికి ఇష్టం వచ్చిన విధంగా వారు పూజలు చేసుకోవచ్చు.. పూర్వ కాలం నియమాలు ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయాయి..  కాని తాజాగా ఖమ్మం జిల్లాలో ఓ మారుమూల గ్రామంలో ఆంజనేయస్వామి దేవాలయంలో జరిగే ధ్వజస్థంభ ప్రతిష్ఠ కార్యక్రమంలో దళితులు పూజలు చేయడానికి వస్తే అడ్డుకున్న ఘటన చోటు చేసుకుంది.  

కారేపల్లి మండలం సీతారాంపురం గ్రామంలో ఆంజనేయ స్వామి దేవాలయంలో ధ్వజస్థంభం ఏర్పాటు చేస్తున్నారు.  అయితే ధ్వజస్తంభ ప్రతిష్టాపన కంటే ముందు జరిగే  పూజా కార్యక్రమాలలో దళితులు పాల్గొనడాన్ని అగ్ర కులస్థులు నిరాకరించారు. దీంతో దళితులు, అగ్రవర్ణాల మధ్య ఘర్షణ జరగడంతో  పంచాయితీ పోలీస్ స్టేషన్ వరకు చేరుకుంది.  చివరికి పోలీసులు ఇరు వర్గాల వారికి నచ్చజెప్పడడంతో  దళితులను దేవాలయ ప్రవేశానికి అంగీకరించారు. 

సీతారామపురంలో గతంలో బొడ్రాయి ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. అప్పుడు కూడా ఈ  కార్యక్రమానికి తమను రాకుండా అడ్డుకున్నారని దళితులు చెబుతున్నారు. అదేవిధంగా ఆంజనేయ స్వామి నూతన గుడి నిర్మాణం ప్రారంభం కార్యక్రమానికి కూడా దళితులను రానివ్వకుండా నిరాకరించారని కొందరు వాపోతున్నారు. ఇప్పుడు ధ్వజస్తంభ ప్రతిష్ట పూజా కార్యక్రమానికి గుడిలోకి దళితులను రానివ్వకూడదనే ఆలోచనతో అగ్రకులాల వారు ఉన్నారని దళితనేతలు చెబుతున్నారు.