
హైదరాబాద్: కొంతమంది ప్రైవేట్ డైరీ వారు విజయ పేరుతో తమ విజయ తెలంగాణ పాల ప్యాకెట్లను విక్రయిస్తూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని.. అలాంటి పాలను కొనుగోలు చేయవద్దని తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం లాలాపేట్లోని విజయ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డైరీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డితో కలిసి చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి మాట్లాడారు.
ప్రజలు విజయ తెలంగాణ అని బ్రాండ్ ఉంటేనే పాలను కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎవరైనా తెలంగాణ నకిలీ పాలను డిస్ట్రిబ్యూటర్స్ వెండర్స్ కొనుగోలు చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే తాము కోర్టును ఆశ్రయించడం జరిగిందన్నారు. ఇలాంటి నకిలీ విజయ పాలతో వచ్చిన ఉత్పత్తులను కొనుగోలు చేయవద్దని సూచించారు. ఇవి ప్రజల ఆరోగ్యానికి సంబంధించినవి కాబట్టి తమ లోగోను పరిశీలించి కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు.