- సిట్టింగ్ ఎమ్మెల్యే చందర్‌కు వ్యతిరేకంగా జట్టుకట్టిన లీడర్లు
- కొద్దిరోజులుగా ఎమ్మెల్యేకు ముఖ్య నేతలకు మధ్య గ్యాప్
- మళ్లీ చందర్‌కు టికెట్ ఇస్తే గెలిచే చాన్స్ లేదంటూ ప్రచారం
- కేటీఆర్‌ను కలిసేందుకు రెడీ అవుతున్న లీడర్లు
గోదావరిఖని, వెలుగు : రామగుండం నియోజకవర్గంలో అధికార బీఆర్ఎస్‌లో అసమ్మతి రగులుతోంది. వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌కు వ్యతిరేకంగా కొందరు ముఖ్య నేతలు జట్టుకట్టారు. వారంతా కలిసి ఆయనకు పార్టీ టికెట్ రాకుండా అడ్డుకునేందుకు తమ వంతు ప్రయత్నాలు స్టార్ట్చేశారు. ఒకవేళ టికెట్ఇస్తే ఆయన మళ్లీ గెలిచే అవకాశం లేదని, తద్వారా పార్టీకి నష్టం జరుగుతుందని బాహటంగానే మాట్లాడుకుంటున్నారు. ఈక్రమంలో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ప్రచారం కూడా స్టార్ట్చేశారు. కొంతకాలంగా స్థానిక లీడర్లకు ఎమ్మెల్యే మధ్య గ్యాప్ఏర్పడింది. ఆత్మీయ సమ్మేళనాలకు ఎమ్మెల్యే అసమ్మతి నేతలను పిలవకపోవడంతో ఈ గ్యాప్మరింత పెరిగింది. మరోవైపు ఎమ్మెల్యే అనుచరుల అరాచకాలతో నియోజకవర్గంలో పార్టీకి నష్టం జరుగుతోందని అసమ్మతి నేతలు భావిస్తున్నారు. తాజా పరిస్థితిపై పార్టీ వర్కింగ్‌ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌కు వివరించేందుకు లీడర్లు రెడీ అవుతున్నట్లు సమాచారం.
సిట్టింగ్ ఎమ్మెల్యే గెలిచే చాన్స్ లేదట..
రామగుండం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌కు ప్రజల్లో వ్యతిరేకత ఉందని, టికెట్ఇస్తే గెలిచే చాన్స్‌లేదని ముఖ్యనేతలు బహిరంగంగా చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ఇవ్వొద్దంటూ పాలకుర్తి జడ్పీటీసీ కందుల సంధ్యారాణి, మాజీ మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ, టీబీజీకేఎస్ జనరల్ సెక్రటరీ మిర్యాల రాజిరెడ్డి, కార్మిక నాయకుడు పాతపెల్లి ఎల్లయ్య ఇటీవల గోదావరిఖనికి వచ్చిన పార్టీ జిల్లా ఇన్‌చార్జి ఎర్రోళ్ల శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లారు.
ముఖ్యంగా ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో ఉద్యోగాల కుంభకోణం, నిరుద్యోగుల నుంచి వసూలు చేసిన డబ్బును తిరిగి పూర్తి స్థాయిలో ఇప్పించకపోవడంపై చందర్‌తో పాటు పార్టీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందని ఆయనకు వివరించారు. ఈక్రమంలో చందర్‌కు అసలు టికెట్ఇవ్వవద్దని, వేరే ఎవరికి ఇచ్చినా గెలిపించుకుంటామని అసమ్మతి నేతలు పార్టీ జిల్లా ఇన్‌చార్జితో చెప్పినట్లు సమాచారం. వీరితోపాటు పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ కూడా ఎమ్మెల్యే వైఖరిపై గుర్రుగా ఉన్నారు. పార్టీ హైకమాండ్తనకు టిక్కెట్ ఇచ్చినా, మరెవరికి ఇచ్చినా పార్టీ గెలుపు కోసం పనిచేస్తానని చెబుతున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో ఆయన నివాసంలో అసంతృప్తి లీడర్లు సమావేశం కావడమే ఇందుకు నిదర్శనం.
ఆత్మీయ సమ్మేళనాలతో మరింత గ్యాప్
కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు అసమ్మతినేతలను ఎమ్మెల్యేగా దూరంగా ఉంచుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇటీవల బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనాలకు కూడా వారిని ఆహ్వానించకపోవడంతో ఈ గ్యాప్మరింత పెరిగింది. వాస్తవంగా అసంతృప్తి లీడర్లు, పార్టీకి దూరంగా ఉన్నవారు, ఆశావహులు, పార్టీలో చేరినవారు, ఉద్యమకారులు.. ఇలా అందరినీ ఏకం చేసేందుకే ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించగా.. ఇక్కడ మాత్రం తమను ఎమ్మెల్యే మీటింగ్‌లకు పిలవడం లేదని పార్టీ జిల్లా ఇన్‌చార్జి ముందు అసమ్మతివాదులు తమ ఆవేదనను వెలిబుచ్చారు. దీనికితోడు గోదావరిఖని సింగరేణి స్టేడియంలో నిర్వహించిన మంత్రి కేటీఆర్ మీటింగ్‌కు కూడా తమను పిలవలేదన్న విషయాన్ని కూడా జిల్లా ఇన్‌చార్జి ముందుంచారు.
వ్యతిరేక ప్రచారానికి సిద్ధమవుతున్నరు..
ఈ ఏడాది చివరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎమ్మెల్యే చందర్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు అసంతృప్తి లీడర్లు రెడీ అయ్యారు. కొంకటి లక్ష్మీనారాయణ తాను మేయర్‌గా ఉన్నప్పుడు ఆయా డివిజన్లలో చేసిన అభివృద్ధి పనుల వివరాలతో ఫ్లెక్సీలు ముద్రించి ఏర్పాటు చేసే పనిలోపడ్డారు. ప్రస్తుతం ఎమ్మెల్యే చందర్ ప్రారంభిస్తున్న అభివృద్ధి పనులన్నీ తన హయాంలోనే తీర్మానమై ఆమోదం పొందాయని, ఇప్పుడు కొత్తగా అభివృద్ధి ఏమీలేదంటూ ఆ ఫ్లెక్సీల్లో వివరించనున్నట్లు తెలుస్తోంది. ఇక మిగతా లీడర్లు కూడా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా అంతర్గత ప్రచారం మొదలుపెట్టారు. గోదావరిఖనిలో కేటీఆర్ బహిరంగ సభలో పాల్గొనేందుకు వచ్చిన పాతిపెల్లి ఎల్లయ్యను స్టేజీ కూడా ఎక్కనీయకపోవడంతో ఆయన బహిరంగంగానే విమర్శలు చేశారు. ఈ వ్యవహరాలన్నింటిని పార్టీ హైకమాండ్దృష్టికి తీసుకెళ్లేందుకు అసంతృప్తులు రెడీ అయ్యారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అమెరికా నుంచి రాగానే ఆయనను కలిసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.