
- రియల్ దెబ్బకు కనుమరుగవుతున్న గుట్టలు
- అనుమతి లేకుండా యథేచ్ఛగా బ్లాస్టింగ్ చేస్తున్న రియల్టర్లు
- బాంబు పేలుళ్లతో వణికిపోతున్న జనం
మహబూబాబాద్, వెలుగు : కొందరు రియల్టర్లు తమ స్వలాభం కోసం రాతి గుట్టలను కరిగించేస్తున్నారు. రాతి, మట్టి గుట్టలతో ఉన్న భూములను అగ్గువకు కొని ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండానే యథేచ్ఛగా బ్లాస్టింగ్ చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తొర్రూరు – శనిగపురం మెయిన్ రోడ్డు సమీపంలో, పాత, కొత్త కలెక్టరేట్ల సమీపంలో, కురవి మండలంలో బలపాల, నేరడ గ్రామాలు, మహబూబాబాద్ మండలం జంగిలిగొండ, నెల్లికుదురు మండలం నరసింహులగూడెం, బంజర స్టేజీ, తొర్రూరు పట్టణంలోని కంఠాయపాలెం రోడ్డు సమీపంలో రాతి గుట్టలు ఎక్కువగా ఉన్నాయి. జిలెటిన్ స్టిక్స్, గన్‌పౌడర్‌ను వాడుతూ గుట్టలను పగులగొడుతున్నారు. పేలుడు ధాటికి రాళ్ల ముక్కలు సమీప గ్రామాల్లో పడుతుండడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
పట్టించుకోని ఆఫీసర్లు
గుట్టలను బ్లాస్టింగ్ చేయాలంటే రెవెన్యూ, పోలీస్, మైనింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి పర్మిషన్ తీసుకోవాలి. తక్కువ తీవ్రత గల పేలుడు పదార్థాలను వినియోగించడంతో పాటు, బ్లాస్టింగ్ టైంలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ రియల్ వ్యాపారులు ఆ నిబంధనలేమీ పట్టించుకోకుండానే బ్లాస్టింగ్‌లు చేస్తున్నారు. అయినా సంబంధిత ఆఫీసర్లు అటు వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. బ్లాస్టింగ్ కారణంగా రాళ్లు ఇండ్లపై పడుతుండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని నెల్లికుదురు మండలంలోని నల్లగుట్ట తండా తండావాసులు ఇటీవల రాస్తారోకోకు దిగారు.
బ్లాస్టింగ్ చేస్తున్న వారిపై చర్య తీసుకోవాలి
రియల్ వ్యాపారులు రోడ్డుకు సమీపంలో ఉన్న భూములను కొని రాతి గుట్టలు తొలగించేందుకు బ్లాస్టింగ్ చేస్తున్నారు. దీనివల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బ్లాస్టింగ్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి
- గొడుగు విజయ, మహబూబాబాద్