ఖమ్మం/ ఖమ్మం రూరల్, వెలుగు: ఖమ్మం జిల్లాలో కొందరు రియల్టర్లు రూట్ మార్చారు. డీటీసీపీ అనుమతుల్లేని ప్లాట్ల అమ్మకాలు, కొనుగోళ్లు నిలిచిపోవడంతో మరో రూట్ ను ఎంచుకున్నారు. రైతుల నుంచి ఎకరాల్లో భూములను కొని ఫామ్ ప్లాట్ల పేరుతో గుంటల్లో కస్టమర్లకు అమ్మేస్తున్నారు. 5, 10, 15 గుంటల చొప్పున అమ్ముతూ, మీకు వ్యవసాయ పాస్ బుక్ లు వస్తాయి, రైతు బంధు, రైతు బీమా కూడా వస్తుందంటూ కస్టమర్లను బుట్టలో పడేస్తున్నారు. వ్యవసాయేతర భూములను గుంటల్లో అమ్మకూడదన్న రూల్స్ ఉన్నా, వాటిలో లొసుగులను ఆధారంగా చేసుకొని వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తున్నారు. కింది స్థాయిలో రెవెన్యూ అధికారులను మేనేజ్ చేస్తూ రిజిస్ట్రేషన్లు కూడా చేయిస్తున్నారు. ఇక ప్లాట్ల అమ్మకాల కోసం, వెంచర్ ప్రమోషన్ చేసేందుకు సరికొత్త మార్కెటింగ్ జిమ్మిక్ చేస్తున్నారు. హైదరాబాద్ తరహాలో ఈవెంట్స్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ఇదే తరహాలో ఒక ప్రైవేట్ సంస్థ కస్టమర్లను ఆకట్టుకుంటోంది. వెంచర్ వేదికగా రెయిన్ డ్యాన్స్, టమాటో ఫెస్టివల్ అంటూ యూత్ ను అట్రాక్ట్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ ఈవెంట్ సక్సెస్ అయితే ప్లాట్లు ఈజీగా అమ్ముడుపోతాయని ప్లాన్
చేస్తున్నారు.
మార్కెటింగ్ జిమ్మిక్కులు ఇలా..
ఖమ్మం రూరల్ మండలం తీర్థాల రెవెన్యూ పరిధిలోని మంగళగూడెం సర్వే నెంబర్ 620లో అవని ఇన్ ఫ్రా ఆధ్వర్యంలో రివర్ వ్యూ రిసార్ట్స్ అండ్ అగ్రి ల్యాండ్స్ పేరుతో ల్యాండ్ డెవలప్ చేస్తున్నారు. దాదాపు 60 ఎకరాల భూమిని మొదటి దశలో గుంటల లెక్కన ప్లాట్లుగా చేసి అమ్ముతున్నారు. తర్వాత దశలో మరో 80 కూడా డెవలప్ చేస్తామని, అప్పుడు మున్నేరు రివర్ వ్యూ ఉంటుందని కస్టమర్లకు చెబుతున్నారు. ఈ ప్లాట్లను అమ్మేందుకు వెంచర్ ల్యాండ్ లో మార్చి 8న హోలీ సందర్భంగా డ్యాన్స్ ఈవెంట్, టమాటో ఫెస్టివల్ ప్లాన్ చేశారు. ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ ద్వారా హైదరాబాద్ నుంచి మేల్, ఫిమేల్ డీజేలు, యాంకర్లను రప్పిస్తున్నారు. ప్లాట్లు కొనుక్కున్న వారికి ఎంట్రీ ఫ్రీ అని, లేకుంటే రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.500గా నిర్ణయించారు. కలర్ ఫుల్ బ్రోచర్లు, వాల్ పోస్టర్లను ప్రింట్ చేసి భారీగా పబ్లిసిటీ చేస్తున్నారు. స్తంభాద్రి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (సుడా) పరిధిలో అతి తక్కువ ధరకే ప్లాట్లు అంటూ కస్టమర్లను ఆకట్టుకుంటున్నారు. మీరు కొన్న భూమిలోనే అగర్వుడ్ చెట్లు, మహాగని వృక్షాలను, పండ్ల మొక్కలను పెంచుతామంటూ అట్రాక్ట్ చేస్తున్నారు.
సహకరిస్తున్న ఆఫీసర్లు!
గుంటల్లో అమ్మే వ్యవసాయ భూములకు రిజిస్ట్రేషన్లు చేయొద్దని ఆదేశాలు ఉన్నా, ఖమ్మం రూరల్ రెవెన్యూ అధికారులు మాత్రం లైట్ తీసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. ఆ సర్వే నెంబర్ లో ఇంతకుముందు భూమి లేకున్నా, కొత్తగా గుంటల్లో భూమిని పార్టేషన్ చేసి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఇప్పటివరకు 20కి పైగా ప్లాట్లు అమ్ముడుపోయాయని, ఇప్పుడు తక్కువ రేటుకు అమ్ముతున్నామని, ఈవెంట్ అయిపోయిన తర్వాత రేటు గజానికి వెయ్యి చొప్పున పెరుగుతుందంటూ మార్కెటింగ్ టీమ్ కస్టమర్లకు చెబుతున్నారు. మార్చి 1 నుంచి రేట్లు పెరుగుతాయని, ముందే బుక్ చేసుకోవాలంటూ తొందరపెడుతున్నారు. గుంటల్లో భూమి రిజిస్ట్రేషన్ ఎలా అని ప్రశ్నిస్తే, అధికారులకు రూ.10వేలు అదనంగా ఇచ్చి తాము మేనేజ్ చేస్తామంటూ సమాధానమిస్తున్నారు. దీన్ని బట్టి, ఇప్పటికే రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్లను బట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఆఫీసర్ల సపోర్ట్ ఉందన్న విషయం అర్థమవుతోంది. అయితే ఈ రిసార్ట్స్ ఏర్పాటు చేస్తున్న భూమిపైనా కొన్ని ఆరోపణలున్నాయి. వీటిని వికారుద్దీన్ భూములు అంటారని, ఈ సర్వే నెంబర్ లో సీలింగ్ ల్యాండ్స్ ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. అసలు సీలింగ్ భూములు ఎలా పట్టా భూములుగా మారాయో తేల్చాలన్న డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి.