న్యూఢిల్లీ: ఐఐటీలో చదువుకున్నప్పటికీ కొందరు నిరక్షరాస్యులుగానే మిగిలిపోయారని ఢిల్లీ ఎల్జీ వీకే సక్సేనా అన్నారు. కేజ్రీవాల్‌తో సహా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ప్రధాని మోడీ విద్యార్హతలపై విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సక్సేనా ఆదివారం మాట్లాడుతూ.. ‘‘సీఎం కేజ్రీవాల్ ఈ విషయంపై అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు విన్నాను. ఎవరైనా తమ డిగ్రీ గురించి మరీ గర్వంగా ఫీలవ్వాల్సిన పనిలేదు. డిగ్రీ అనేది తాము చదివినదానికి వచ్చిన రశీదు మాత్రమే. కానీ, నిజమైన విద్య మీ నాలెడ్జ్, మీ ప్రవర్తనలో ఉంటుంది. కొందరు ఐఐటీలో చదువుకున్నప్పటికీ వాళ్ల ప్రవర్తనను బట్టి నిరక్షరాస్యులని నిరూపితమైంది”అని సక్సేనా అన్నారు.
ఇది తప్పుడు ప్రచారమే: ఆప్ మంత్రి ఆతిశీ
ఎల్జీ సక్సేనా కామెంట్లకు ఢిల్లీ విద్యాశాఖ మంత్రి ఆతిశీ కౌంటర్ ఇచ్చారు. ఐఐటీల్లో చదువుకున్న ఎంతోమంది ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలకు సీఈవోలుగా ఉన్నారని, మన దేశం గర్వపడేలా చేస్తున్నారని అన్నారు. తమ డిగ్రీలు చూపించుకోలేనివాళ్లే ఇతరుల డిగ్రీలపై, ఐఐటీలాంటి ప్రతిష్టాత్మక సంస్థలపై తప్పుడు ప్రచారాలు చేస్తారు” అని ఆతిశీ మండిపడ్డారు. ఎల్జీ కూడా ఆయన డిగ్రీ ఏంటో చూపించాలని డిమాండ్ చేశారు. దేశంలో ఎన్నో తీవ్రమైన సమస్యలు ఉండగా ఎవరి డిగ్రీ గురించో రాజకీయాలు చేసుడేందని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కామెంట్ చేశారు.