ఏటీఎంల పుణ్యమే నిర్మాణ లోపాలా? బిఎస్ రాములు, మాజీ చైర్మన్, తెలంగాణ బీసీ కమిషన్

ఏటీఎంల పుణ్యమే నిర్మాణ లోపాలా? బిఎస్ రాములు, మాజీ చైర్మన్, తెలంగాణ బీసీ కమిషన్

కొత్త ప్రాజెక్టులు ఏటీఎంలయ్యాయి అనే మాట నానుడిగా మారిపోయింది.  కేసీఆర్​ను మనమే ఎన్నుకున్నందున మనపై మనమే జాలిపడుదాం. మన ఇంజినీర్ల  అసమర్థత వల్ల మనల్ని మనమే ఓదార్చుకుందాం.  కేసీఆర్​పై కోపం పోయి జాలి కలుగుతున్నది. నాడు పని నడుస్తున్న ప్రాజెక్టును ఆపి తిరగదోడడం కేసీఆర్​ చేసిన పెద్ద తప్పు. కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ఎగువ ప్రాంతం వదిలి,  ప్రాజెక్టు దిగువకు కట్టాలనుకోవడంతో కేసీఆర్ చేసిన పొరపాటు మొదలైంది. ఆ తప్పుకు  కొందరు రిటైర్డ్​ ఇంజినీర్లు, ప్రభుత్వ ఇంజినీర్లు కూడా కారణమే.

అలా రీ డిజైన్ చేయడానికి కేసీఆర్ నాకు ఎన్నో కారణాలు చూపారు. బాగా ఎగువన కడితే మహారాష్ట్ర ప్రాంతాలు మునుగుతాయి. రెండు రాష్ట్రాల ఘర్షణలు, కోర్టు, జల ఒప్పందాల వలయంలో చిక్కుకుంటాం. అలా ఎన్నటికీ  ప్రాజెక్టు పూర్తి కాకుండా మనకు నీళ్లు అందకుండా వైయస్ రాజశేఖర్ రెడ్డి చేసిన పన్నాగం వలె ప్రాజెక్టు ఎన్నడూ పూర్తి కాదన్నారు. అలా ప్రాజెక్టు దిగువన కట్టాల్సి వచ్చింది అన్నారు కేసీఆర్. నాకేమీ ఇంజినీరింగ్ పరిజ్ఞానం లేదు. ఆయన మూడు గంటలు ఓపికగా గూగుల్ సాయంతో గోడపై చూపిస్తూ వివరిస్తుంటే  బాగానే వుందని  రెండు  వ్యాసాలు కూడా రాశాను.

మనకు  ఒక ఆలోచన కలిగాక ఇంజినీరింగ్ నిపుణులకు అప్పగించాలి. వాళ్లే అది ఎలా చేయాలో చెప్తారు. వారు చెప్పినట్టు చేయాలి. ఉదాహరణకు  ఒక బిల్డర్ స్థలం కొని ఇంజినీర్లకు చూపారు.  డబుల్ బెడ్రూంలు , త్రిబుల్ బెడ్రూంలు, వాస్తు మొదలైనవి కోరుకున్నారు. ఇక   నాలుగు రకాల ఇంజినీర్లు డిజైనింగ్, స్ట్రక్చర్, ఎలివేషన్, నీరు, కరెంటు, స్నానపు గదులు, ఇంటీరియర్, కార్ పార్కింగ్,  ఎలా ఉంటాయో మూడు నాలుగు ప్లాన్ లు వేసి చూపిస్తారు.

చాలా మందికి తెలియని విషయం ఏమంటే మన కోసం కట్టే అపార్టుమెంటును మన కోసం కాకుండా మన కార్ పార్కింగ్ కు అనువుగా ఫుట్టింగులు పిల్లర్లు, బీములు వేయాల్సివస్తుంది. బిల్డర్ సూచనలు సాధ్యాసాధ్యాలు, మునిసిపల్ కార్పొరేషన్ నియమ నిబంధనలు అన్ని వివరించి చివరకు ఏకాభిప్రాయానికి వచ్చి ఇరువురు కలిసి ప్లాన్ ఫైనల్ చేస్తారు. ఆయా ఇంజినీర్లు పనిని  పర్యవేక్షిస్తారు. నీటిని నిలువ చేసే ప్రాజెక్టులపై కూడా ఇలాగే అనేక దశల గుండా తుది నిర్ణయానికి వస్తారు. అందువల్ల కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలకు ఇంజినీర్లు బాధ్యత వహించాలి. కాంట్రాక్టర్ లోపాలను పర్యవేక్షించడం కూడా  ఇంజినీర్లదే బాధ్యత. కాళేశ్వరంతోపాటు ఇపుడు అన్నారం ప్రాజెక్టు కింద కూడా ఇసుక కిందికి కొట్టుకుపోతున్నది. రెండు బ్యారేజీలు ఒకే లోపంతో అల్లాడుతున్నాయి. 

అతి తెలివి తెచ్చిన అనర్థం

ప్రపంచంలో అత్యంత వేగంగా కట్టిన ప్రాజెక్టు ఇదే.  అత్యంత తొందరగా  పిల్లర్లు కుంగిన ప్రాజెక్టు కూడా ఇదే. తెలంగాణ ఇంజినీర్లు ఎంత అసమర్థులో  స్పష్టమైపోయింది. ముఖ్యమంత్రి చెప్పినదానికి తలఊపే వాళ్ల  తెలివి ఏమైనట్టు? అవినీతిలో వారు కూడా భాగస్వాములు. వారి సంతకాల ఆమోదంతోనే ప్రాజెక్టు పనులు సాగుతాయి. కనుక అన్నిటికి వారే బాధ్యులు. అలా చేయడం ఇష్టంలేక కొందరు రాజీనామా చేశారు. కొందరు బదిలీ చేయించుకున్నారు. కొందరు సెలవుపై వెళ్లి వుంటారు. మిగతా  ఇంజినీర్స్ వీటికి బాధ్యులు. కేసీఆర్ మీద జాలి ఎందుకు కలిగిందంటే తనకు తెలియని ఇంజినీరింగ్ టెక్నికల్ విషయాలను కూడా తానే నిర్ణయించి నిర్దేశించడం.

తనకున్న అధికారంతో ఇంజినీర్లు తన ప్లాన్​ను ఆమోదించేట్టు చేసుకున్న అతి తెలివి మీద నాకు జాలి కలుగుతున్నది.  ఒక బిల్డర్ తనకు ఏం కావాలో చెప్పాక అది ఎట్లా చేయాలో ఇంజినీర్లు నిర్ణయిస్తారు. దాన్ని అంగీకరించడం మనకోసమే. ఇంజినీర్లు చెప్పేది మన మేలు కోరి చెప్పేదే.  ఆ విషయం మర్చిపోయి ఇగోకు పోయి అన్ని దశలను కేసీఆర్ నిర్ణయించడం వల్ల జరిగింది ఇదంతా. శాసన సభలో చర్చ జరిగినపుడు మన ఇంజినీర్లు రిటైరైనవారు, ఆర్ విద్యాసాగరరావుతో సహా ఏంచేశారు? గ్రావిటీ కాకుండా ఎత్తిపోతలతో ఎటు నుంచి ఎటైనా మలుపుకోవచ్చు కదా అని ఇంజినీర్ శ్యాం ప్రసాద్​రెడ్డి వంటి వారు అంటారు. ఒక ఎకరానికి నీళ్లందడానికి  రూ. 60 వేల ఖర్చు అనేది మునుపెన్నడూ కనీవిని ఎరుగని ఖర్చు.

ఇంత ఖర్చును ఇంజినీర్లు ఎలా ఆమోదించారు?  ప్రభుత్వంలో ఉన్న ఇంజినీర్లంతా అవినీతి పరులేనా? అవినీతిలో భాగస్వాములేనా? కేసీఆర్ తోపాటు హరీష్ రావు పాత్రేమిటి?  కేసీఆర్  తన అజ్ఞానంతో తెలంగాణ సమాజాన్ని  ముంచారు. లక్ష ఇరవై వేల కోట్లు మునిగిపోయినయి. వాటికి పదివేల కోట్ల వడ్డీ కట్టాలి. అన్నీ తెలుసంటే..  జాలి కలుగుతుంది.

ఆహా, ఓహోలతో గారడీలు

ప్రజలకు అందుబాటులో లేని ముఖ్యమంత్రిని, తన మాటే సాగాలనే  ముఖ్యమంత్రిని మళ్లా ఎన్నుకోవడం అవసరమా? అన్నీ తనకు తెలుసనే అజ్ఞానం పట్ల నాకు జాలి కలుగుతున్నది. నిపుణుల మాట వింటే తనకే మేలు అనే విషయం మరిచినవారి పట్ల జాలి పడడం తప్ప ఏం చేయగలం? వదిలించుకోవడం పరిష్కారం కాకపోవచ్చు. కానీ, మరిన్ని తప్పుడు నిర్ణయాలతో తెలంగాణ ప్రజలను మరింత ముంచకుండా, మరింత అప్పులపాలు చేయకుండా తెలంగాణను కాపాడుకోవాలి. ఇప్పటికే రూ.5 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసి గారడి విద్యలతో  ఆహా ఓహో అనిపించింది చాలు.ఈ రెండు బ్యారేజీల కింద ఇసుక కిందికి కోసుకుపోవడం, కొన్ని పిల్లర్లు కుంగడం, అధిక వ్యయంతో నిర్మించడం చూస్తే..   అంతిమంగా తెలంగాణ సమాజానిది ఎంత అమాయకత్వమో,  తెలంగాణ ఇంజినీర్లు ఎంత అసమర్థులో ప్రపంచానికి చెప్పకనే చెప్పినట్టయింది.

చెరువుల ముందు డ్యామ్​లు అపహాస్యమవుతున్నాయి

వడ్డెర రాజులు అని పిలువబడ్డ కాకతీయులు నిర్మించిన గొలుసు చెరువులు శతాబ్దాలుగా  చక్కగా పని చేస్తున్నాయి. అతి తెలివికలవారం అనుకున్న నేటి పాలకులు, ఇంజినీర్లు అపహాస్యం పాలవుతున్నారు. మొదటి నుంచి నా ప్రతిపాదన చెరువుల నిర్మాణం. వాటిని ఆధునిక భాషలో మత్తడి దుంకే చెక్ డ్యాంలు అంటున్నారు. పూర్వం కట్టిన చెరువు నిండితే సహజ పద్ధతిలో అదనపు వరద కిందికి పోయేందుకు మత్తడి కట్టేవారు.  మత్తడి చెరువు గర్భంలో కాకుండా చెరువు నిండిన కట్ట తరువాత కట్టేవారు. ఇపుడు ప్రాజెక్టుల పేరుతో  చెరువు గర్భంలో మత్తడి పోవడానికి గేట్లు కడుతున్నారు. వీటి ద్వారా నీటిని వదలడం, తిరిగి గేట్లు బిగించడం పెద్దపని. చెరువులు, ప్రాజెక్టులు నింపేది వర్షాధార నీరే కదా!  ఎక్కడికక్కడ కట్టలు అడ్డుకట్టలే కదా నేటికీ చేస్తున్నది.

ఆ కట్టే కట్టలు భారీ కట్టలు ఎందుకు? ఎక్కడి నీరు అక్కడ నిలవ చేసుకొని వాడుకోవడం తోడుకోవడం అనువుగా ఐదారు కిలోమీటర్ల లోపు కట్టలు కడితే ఎన్నో  ప్రయోజనాలు. తక్కువ ఖర్చు. శాశ్వతంగా ఉంటాయి. ఎక్కడికక్కడ భూగర్భ జలాలు పెరుగుతాయి. బావుల్లో పుష్కలంగా నీరుంటుంది. చేపలు పెంచుకోవచ్చు. వ్యవసాయానికి తాగునీటికి రెంటికీ ఉపయోగించుకోవచ్చు. ఏటా పూడిక తీసేయవచ్చు.

ALSO READ : కొత్త చట్టాలు..కొత్త సమస్యలు: మంగారి రాజేందర్, జిల్లా జడ్జి (రిటైర్డ్)

చెరువు పరిసరాల్లో బోలెడు చెట్లు పెంచవచ్చు.  చెరువుకట్ట రహదారిగా ఉపయోగించుకోవచ్చు. పార్కులుగా వాడుకోవచ్చు. బోటింగ్​కు ఉపయోగించుకోవచ్చు. విశేషమేమంటే ఈ ప్రాజెక్టుల ద్వారా తమ వాటా పొందుతూ ఆంధ్రాలో  ఆ ముఖ్యమంత్రి, తెలంగాణలో ఈ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చారు. అనగా ప్రజల డబ్బు దోచి ప్రజల మీద అధికారంలోకి వచ్చారు. అలా వారికి ప్రాజెక్టుల నిర్మాణం ఎపుడంటే అపుడు డబ్బు తీసుకునే ఏటీఎంలుగా మారిపోయాయి.

– బి ఎస్ రాములు, మాజీ చైర్మన్, తెలంగాణ బీసీ కమిషన్