రవాణా శాఖలో ‘లీకు’ వీరులు..ఫ్యాన్సీ నంబర్ల వేలం వివరాలు బహిర్గతం​

రవాణా శాఖలో ‘లీకు’ వీరులు..ఫ్యాన్సీ నంబర్ల వేలం వివరాలు బహిర్గతం​
  • టెక్నికల్ టీంలతో దళారుల కుమ్మక్కు
  • గత సర్కారు హయాంలో అక్రమ దందాకుతెరలేపిన ఓ ఉన్నతాధికారి
  • ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి

హైదరాబాద్, వెలుగు : రవాణా శాఖలో  కొందరు సిబ్బంది ఫ్యాన్సీ నెంబర్ల వేలం వివరాలను లీక్​ చేస్తూ వాహనదారులకు సహకరిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. ఈ విషయం పై కొందరు ఉద్యోగులు ఫిర్యాదులు చేస్తున్నా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని తెలుస్తున్నది. గత బీఆర్ఎస్​ ప్రభుత్వ హయాంలోనే ఈ అక్రమ దందాకు ఓ ఉన్నతాధికారి తెర లేపినట్టు తెలిసింది. కాంగ్రెస్​ ప్రభుత్వం రాగానే ఆయన ఈశాఖను వదిలి వెళ్లినా.. ఇంకా ఆయన అనుచరులుగా చెప్పుకుంటున్న వారు యధావిధిగా తమ దందాను కొనసాగిస్తున్నట్టు సమాచారం.

ఇటీవల టీజీగా మార్చిన తర్వాత ఫ్యాన్సీ నెంబర్ల కోసం పెద్ద సంఖ్యలో వాహనదారులు ఎగబడుతున్నారు. ఫ్యాన్సీ నెంబర్ల వేలం ద్వారా సర్కారుకు ఇప్పటికే పెద్దమొత్తంలో ఆదాయం వస్తోంది. అయితే కొందరు టెక్నికల్​ సిబ్బంది వేలం వివరాలు ముందే దళారులకు చేరవేస్తున్నట్టు సమాచారం. దీంతో వాహన యజమానులు వేలంలో తక్కువకు కోట్ చేయించి అనంతరం వారి నుంచి పెద్దమొత్తంలో లంచంగా  తీసుకుంటున్నట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ వ్యవహారం అంతా గత ప్రభుత్వంలో ఉన్నత పదవిలో కొనసాగిన అధికారి కనుసన్నల్లోనే జరిగిందని, ప్రస్తుతం ఆ అధికారి ఈ శాఖలో లేకున్నా ఆయన నియమించిన ఔట్‌‌‌‌సోర్సింగ్‌‌తో పాటు రెగ్యులర్ ఉద్యోగులు కొనసాగిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 

ముడుపులు తీసుకొని ఔట్‌‌సోర్సింగ్ ఉద్యోగాలు 

ఆర్టీఏలో గత ప్రభుత్వ హయాంలో ఓ  అధికారి పెద్దమొత్తంలో ముడుపులు తీసుకుని  ఔట్‌‌సోర్సింగ్ సిబ్బందిని నియమించినట్టు ఆరోపణులున్నాయి.  ముడుపులు  చెల్లించిన సిబ్బంది ఉద్యోగంలో చేరినప్పటి నుంచి తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారని తెలిసింది. గత పదేండ్లలో సదరు అధికారి హయాంలో నియామకం అయిన ఔట్‌‌సోర్సింగ్ ఉద్యోగులతోపాటు రెగ్యులర్ ఎంప్లాయిస్​ ప్రస్తుతం రవాణాశాఖలో చక్రం తిప్పుతున్నారని ఆ శాఖ ఉద్యోగులు కొందరు ఆరోపిస్తున్నారు.

వీరు ఫ్యాన్సీ నంబర్ల కోసం ఎవరు ఎంతకు కోట్​ చేశారనే వివరాలు కొందరు దళారులకు, ఫ్యాన్సీ నెంబర్లు కావాల్సిన వాహన యజమానులకు ముందే సమాచారం ఇస్తున్నట్టు తెలిసింది.  వారితో తక్కువ కోట్​ చేసేలా చేసి, పెద్దమొత్తంలో ముడుపులు తీసుకుంటున్నట్టు సమాచారం. గతంలో పనిచేసిన ఉన్నతాధికారి ఇలా దళారులతో కుమ్మక్కై ఈ దందాను నడిపించినట్టు తెలిసింది.  

వాహనదారులతో టెక్నికల్​ టీం బేరసారాలు..

రవాణా శాఖ ఫ్యాన్సీ నెంబర్లకు ఆన్‌‌లైన్ వేలం నిర్వహిస్తుంది. రూ.10 వేల నుంచి రూ.20 వేల ఫీజును ముందుగా చెల్లించి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు బిడ్డింగ్ లో పాల్గొనాల్సి ఉంటుంది. ఒక్కరే దరఖాస్తు చేసుకుంటే వారికే రవాణా శాఖ నిర్ణయించిన ధర కన్నా కొంచెం ఎక్కువకు ఆ నెంబర్‌‌ను కేటాయిస్తారు. ఆ నెంబర్‌‌కు దరఖాస్తులు ఎక్కువగా వస్తే మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 4 గంటలదాకా  ఆన్‌‌లైన్ వేలం నిర్వహిస్తారు.

ఆ టైంలోనే కొందరు టెక్నికల్​ సిబ్బంది వాహనదారులతో బేరసారాలు చేసుకుని వివరాలను లీక్​ చేస్తున్నట్టు తెలిసింది. దీంతో ప్రభుత్వానికి రావాల్సిన ధర కన్నా తక్కువ ధరకే ఈ ఫ్యాన్నీ నెంబర్లు వారి సొంతం అవుతున్నాయి.