కులగణన సర్వేకు వీఐపీలు వివరాలు ఇస్తలే.!

కులగణన సర్వేకు వీఐపీలు వివరాలు ఇస్తలే.!
  • కులగణన సర్వేకు సహకరించని
  • కొందరు వీఐపీలు, నేతలు, సర్కారు ఉద్యోగులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుల గణన సర్వేలో వీవీఐపీలు, వీఐపీలు, కొందరు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు వివరాలు నమోదు చేసుకోవడం లేదు. ప్రధానంగా జీహెచ్ఎంసీ ఏరియాలోనే ఎక్కువ  మంది తమ వివరాలను ఎన్యుమరేటర్లకు చెప్పడంలేదు. కొన్ని ఇతర జిల్లాల్లోనూ పదుల సంఖ్యలో కుటుంబాల వివరాలు నమోదు కాలేదు. వీళ్లు కూడా వీఐపీలు, ప్రజాప్రతినిధులేనని తెలుస్తోంది. సర్వే కోసం రాష్ట్రంలో మొత్తం 1,18,02,726  ఇండ్లకు స్టిక్కరింగ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా చూస్తే సర్వే 96 శాతం పూర్తయినట్లు అధికారులు ప్రకటించారు. 

చాలా జిల్లాల్లో వంద శాతం పూర్తయినట్టు చెప్తున్నారు.  జీహెచ్ఎంసీ పరిధిలో 25 లక్షల 5 వేల 517 ఇండ్లకు స్టిక్కరింగ్ చేశారు. అయితే జీహెచ్​ఎంసీలోనే ఇంకో నాలుగున్నర లక్షల ఇండ్లకు సంబంధించి సమాచారం సేకరించాల్సి ఉన్నది. ఈ లిస్ట్ లో సినిమా ఇండస్ర్టీకి చెందినోళ్లు, బడా వ్యాపారులు, ప్రజా ప్రతినిధులు, సాఫ్ట్​​వేర్, ఇతర జాబ్స్, ఉన్నతస్థానాల్లోనివాళ్లు ఉన్నట్లు తెలుస్తున్నది. వీరు వ్యక్తిగత వివరాలను ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారని పైస్థాయి అధికారులకు ఎన్యుమరేటర్లు నివేదించారు.

Also Read:-డబుల్ టెన్షన్ .. భద్రాచలంలో ఇండ్ల పంపిణీకి ఏర్పాట్లు

ఆస్తులు, అప్పులు, ఆధార్ కార్డు నెంబర్లు, కుటుంబసభ్యుల వివరాల వంటివి చెప్పేందుకు ఇష్టపడటం లేదని.. తమకు ప్రభుత్వం నుంచి ఏదీ అవసరం లేదని అంటున్నట్లు ఎన్యుమరేటర్లు చెప్తున్నారు. కనీస సమాచారమైనా ఇవ్వాలని కోరినా ఇంటి గేటు దగ్గర సెక్యురిటీ సిబ్బందితో చెప్పి వెనక్కి పంపిస్తున్నారని అంటున్నారు. వాస్తవానికి జీహెచ్ఎంసీతో పాటు పట్టణ ప్రాంతాలైన జిల్లా టౌన్​లలోనూ పూర్తి స్థాయిలో ఇండ్ల వివరాలు సేకరించలేదు. ఉదాహరణకు ఒక బిల్డింగ్​లో నాలుగైదు అంతస్తులు ఉంటే.. ఒకటే స్టిక్కరింగ్ చేశారు.

 వివరాల సేకరణకు వెళ్లినప్పుడు అన్ని అంతస్తుల్లో ఉన్న కుటుంబాల వివరాలను వేర్వేరు దరఖాస్తుల్లో నింపారు. దీంతో కుటుంబాల సంఖ్య పెరిగింది. ఇలా కుటుంబాల సంఖ్య పెరగడంతో.. నిజంగా వివరాలు ఇవ్వని వాళ్ల సంఖ్యపై స్పష్టత రావడం లేదు. అందుకే వివరాలు ఇవ్వని కుటుంబాల సంఖ్య కూడా ఎక్కువే ఉంటుందని అంటున్నారు.  

స్పెషల్ డ్రైవ్ కు సీఎం ఆదేశాలు 

సమగ్ర ఇంటింటి కులగణన సర్వేలో భాగంగా జూబ్లీహిల్స్​లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఆయన కుటుంబ వివరాలను జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి, ఇతర అధికారులు సేకరించారు. సీఎం తెలియజేసిన వివరాలను ఎన్యుమరేటర్ నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా సర్వే పురోగతిపై అధికారులను సీఎం అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి స్పందన ఎలా ఉందని ఆరా తీశారు. హైదరాబాద్ పరిధిలో వీవీఐపీలు, ఐఏఎస్ లు, ఐపీఎస్ లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధుల కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి వివరాలు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగులు ఖచ్చితంగా సర్వేలో వివరాలు నమోదు చేసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని చెప్పారు. వీలయినంత త్వరగా కుల గణన సర్వే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, జీహెచ్ఎంసీ స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి,  ఇతరులు పాల్గొన్నారు.