- వినియోగదారులను దోచుకుంటున్న అధికారులు, సిబ్బంది
- ఫ్రీ వాటర్ స్కీంకు మీటర్ల బిగింపు తప్పనిసరి
- ఎంప్యానల్ అయిన కంపెనీలవే కొనాలంటూ రూల్
- దొరికే చోటు చెప్పకుండా బిగిస్తూ దోచుకుంటున్న సిబ్బంది
- పాత మీటర్లు పని చేయట్లేదంటూ నాసిరకం మీటర్ల అంటగడుతున్నరు
హైదరాబాద్‌సిటీ, వెలుగు : గ్రేటర్‌పరిధిలో మీటర్ల బిగింపు పేరుతో కొందరు వాటర్‌బోర్డు సిబ్బంది, అధికారులు వినియోగదారులను దోచుకుంటున్నారు. వాటర్‌బోర్డు ఎంప్యానల్ చేసుకున్న కంపెనీల మీటర్లనే బిగించుకోవాలన్న రూల్పెట్టడంతో దాన్ని అధికారులు అనుకూలంగా వాడుకుంటున్నారు. మీటర్లు ఎక్కడ దొరుకుతాయో చెప్పకుండా తామే బిగిస్తామంటూ రెట్టింపు ధరలు తీసుకుంటున్నారు.
గ్రేటర్లో ప్రతి వినియోగదారుడికి నెలకు 20వేల లీటర్ల వరకు నీటిని ఉచితంగా సరఫరా చేసే పథకం కొనసాగుతోంది. ఈ స్కీం వర్తించాలంటే ప్రతి ఒక్కరూ ఆధార్ నెంబర్ లింక్ చేసుకోవడంతో పాటు మీటర్ పెట్టుకోవాలి. నగరంలో సగానికి సగం నల్లాలకు మీటర్లు లేకపోవడంతో ఉచిత నీటి పథకం కోసం తప్పనిసరిగా మీటర్లు బిగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో వారి బలహీనతను ఆసరాగా చేసుకుని వసూళ్లకు పాల్పడుతున్నారు.
నాసిరకం మీటర్లతో దందా
గ్రేటర్లో 13.80 లక్షల మంది వినియోగదారులండగా 50 శాతం మేర కనెక్షన్లకే మీటర్లున్నాయి. ఐదేండ్ల కింద వాటర్ బోర్డు ఆటోమేటిక్మీటర్ రీడింగ్(ఏఎంఆర్) పేరుతో కొత్త మీటర్లను ప్రయోగాత్మకంగా అమర్చాలని నిర్ణయించింది. జీఐఎస్ సిస్టమ్ ద్వారా హెడ్డాఫీసు నుంచే మీటర్‌రీడింగ్ తీసుకునే అవకాశం ఉంటుంది. దాదాపు 40 వేల మీటర్లను కొనేలా 15 కంపెనీలను ఎంప్యానల్ చేసుకున్నారు. వీరు ఇచ్చే మీటర్లే వినియోగదారులకు బిగిస్తారు. ఇందులో అర అంగుళం రూ. 3వేలు, ఎంఎస్బీ, కమర్షియల్కనెక్షన్లకు రూ.30వేలు చెల్లించాల్సి ఉంటుంది.
అయితే, కొందరు అధికారులు ఎంప్యానల్అయిన కొన్ని కంపెనీలతో కుమ్మక్కయి నాసిరకం మీటర్లను కొన్నట్టు ఆరోపణలున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఇదివరకు బిగించిన దాదాపు 12,500 మీటర్లు పనిచేయడం లేదని తెలుస్తోంది. కొందరు వినియోగదారులు తమకు ఫ్రీ వాటర్వర్తించడం లేదని అధికారుల దృష్టికి తీసుకుపోతే, చెక్‌చేసి ‘మీ మీటర్ పని చేయడం లేదు. కొత్త మీటర్ పెట్టుకోవాలి’ అని మారుస్తూ దండుకుంటున్నారు. బోర్డు పరిధిలో ఎంప్యానల్అయిన కంపెనీలు సరఫరా చేసిన మీటర్లు పని చేయడం లేదని తెలిసినా అధికారులు కిమ్మనడం లేదు.
కొత్త మీటర్ల పేరుతోనూ..
మీటర్లు లేనివాళ్లు, ఇది వరకు పెట్టుకున్న వాళ్ల దగ్గరకు వెళ్తున్న అధికారులు ‘మీటర్పని చేయడం లేదని..కొత్త మీటర్ పెట్టుకోవాలి’ అని చెబుతున్నారు. వినియోగదారుడే కొనుక్కుందామంటే ఎక్కడ దొరుకుతాయో చెప్పడం లేదు. మీటర్అసలు ధర రూ.3 వేలు కాగా, రూ. 6 వేల వరకూ తీసుకుంటున్నారు. ఎంఎస్బీ కనెక్షన్‌కు రూ. 30వేలు తీసుకోవాల్సి ఉండగా, రూ. 50వేల వరకు వసూలు చేస్తున్నారు. ఎంప్యానల్అయిన కంపెనీలు నాసిరకం మీటర్లను బిగిస్తూ ఒకవైపు, కొత్త మీటర్ల పేరిట మరోవైపు అవినీతి కి పాల్పడుతున్నారు. సదరు సిబ్బంది, అధికారులపై చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.