సీఎస్ సోమేశ్ కుమార్ విషయంలో హైకోర్టు తీర్పును టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్వాగతించారు. బిహార్ ముఠాకు సోమేశ్ లీడర్ అని అనర్హుడైన ఆయనను వెంటనే పదవి నుంచి తొలగించాలని అన్నారు. ఇప్పటి వరకు సోమేశ్ కుమార్ సీఎస్ హోదాలో తీసుకున్న నిర్ణయాలు సమీక్షించి, వాటిపై సీబీఐ విచారణ చేపట్టాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమేశ్ కుమార్ తీసుకొచ్చిన ధరణి పోర్టల్ రద్దు చేయాలని అన్నారు. ధరణిలో లోపాల కారణంగా చనిపోయిన రైతుల గోస సోమేశ్ కు తాకిందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రాంత ఐఏఎస్ లకు ఎప్పటికైనా ప్రాధాన్యం ఇవ్వాలని రేవంత్ సూచించారు.
తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్కు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆయనను ఏపీ క్యాడర్కు వెళ్లాలని ఆదేశించింది. రాష్ట్రానికి సోమేశ్ కుమార్ కేటాయింపును రద్దు చేసిన ధర్మాసనం.. సర్టిఫైడ్ కాపీ అందిన వెంటనే ఏపీకి వెళ్లాలని ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన సమయంలో సోమేశ్ కుమార్ను కేంద్రం ఏపీకి కేటాయించింది. అయితే కేంద్రం ఉత్తర్వులపై ఆయన క్యాట్ను ఆశ్రయించడంతో 2016లో సోమేశ్ కుమార్ తెలంగాణలో కొనసాగేలా హైదరాబాద్ క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది.