- పార్టీ మార్పుపై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని సూచన
ఖమ్మంరూరల్, వెలుగు: మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో ఎంపీ నామా నాగేశ్వరరావు, మిర్యాలగూడెం ఎమ్మెల్యే భాస్కర్రావు బుధవారం హైదరాబాద్లోని తుమ్మల నివాసంలో భేటీ అయ్యారు. గంటకుపైగా వీరి మధ్య చర్చలు జరిగినట్టు సమాచారం. పాలేరు టికెట్ దక్కకపోవడంపై తుమ్మల కొంత నిరాశతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని, పార్టీలో, ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పిస్తారని సీఎం మాటగా చెప్పమన్నారని తుమ్మలకు వివరించారు. దీనిపై తుమ్మల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో నామా, ఎమ్మెల్యే భాస్కర్రావు వెనుదిరిగినట్టు సమాచారం.
తుమ్మలకు టికెట్ రాకపోవడంపై ఆగ్రహంతో ఉన్న ఆయన అనుచరులు ఎలాగైనా పోటీలోఉండాలని ఆయనపై ఒత్తిడి తెస్తున్నారు. అవసరమైతే కాంగ్రెస్ నుంచైనా బరిలో ఉండాలని కోరుతున్నారు. ఈ నెల 25న హైదరాబాద్ నుంచి తుమ్మల ఖమ్మం రానున్నారు. జిల్లా సరిహద్దు మామిళ్లగూడెం వద్ద వెయ్యి కార్లతో స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడే కాంగ్రెస్ పార్టీలో చేరికపై ప్రకటన చేయించే విధంగా ప్లాన్ చేస్తున్నారు. బుధవారం సత్తుపల్లి, వైరా, ఇల్లెందు నియోజకవర్గాల్లో తుమ్మల అనుచరులు ఆత్మీయ సమావేశాలు నిర్వహించి మద్దతు ప్రకటించారు.