ఢిల్లీ: ఏపీ రాజధాని విషయంలో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని అన్నారు ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. దేశంలో అనేక చోట్ల రాజధానులు పెడుతున్నారని, ఆ విషయంలో కేంద్రం ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని చెప్పారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు కూడా రాజధాని పేరుతో సింగపూరు, జపాన్, చైనా అని కథలు చెప్పారని, ఆయన మాటల పై కేంద్రం ఎటువంటి అభ్యంతరం చెప్పలేదన్నారు. ఇప్పుడు మూడు రాజధానుల విషయంలోనూ అదే వైఖరితో ఉన్నామన్నారు.
రైతులకు న్యాయం జరగాలి అన్నదే తమ నినాదమని, రాజధాని పై తమను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఏపీ రాజకీయాల్లో సీరియస్ గా ఉండబోతున్నామని చెప్పారు. చంద్రబాబు బీజేపీ తనకు దగ్గరవుతుందని సంకేతాలు ఇస్తున్నారని, ఇదంతా వారు ఆడే ఒక రాజకీయ చదరంగమని అన్నారు. ఈ చదరంగంలో తాము సైతం కొత్త ఎత్తుగడలతో వస్తామని చెప్పారు. బిజెపి జనసేన కు 20 శాతం ఓటు బ్యాంకు ఉందని, బిజెపి సకల జనుల పార్టీ అని సోము వీర్రాజు ఈ సందర్భంగా అన్నారు.