తల్లి అంత్యక్రియలకు వస్తూ కొడుకు, కోడలు మృతి

వరంగల్ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికల్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రిటైర్డ్ సీఐ విజయ్ కుమార్, ఆయన భార్య సునీత మృతి చెందారు. విజయ్ తల్లి రమణమ్మ గత రాత్రి ఆదిలాబాద్ జిల్లాలోని యాపల్‌గూడలో అనారోగ్యంతో మృతిచెందింది. తల్లి మరణవార్త తెలుసుకున్న విజయ్.. భార్య, కూతురుతో కలిసి కారులో వరంగల్ నుంచి ఆదిలాబాద్ బయలుదేరారు. అయితే వారు ప్రయాణిస్తున్న కారును పెంచికల్ దగ్గరకు రాగానే ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో విజయ్, ఆయన భార్య సునీత అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆయన కూతురుతో పాటు మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. విజయ్, ఆయన భార్య మృతితో రమణమ్మ అంత్యక్రియలు వాయిదా పడ్డాయి. కాగా.. విజయ్, సనీతల మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత ముగ్గురికి ఒకేసారి అంత్యక్రియలు నిర్వహిస్తారని తెలుస్తోంది.