ఆస్తి రాసివ్వాలని కొడుకు, కోడలు వేధింపులు.. వరంగల్ జిల్లాలో ఓ తండ్రి ఆత్మహత్య

 ఆస్తి రాసివ్వాలని కొడుకు, కోడలు వేధింపులు.. వరంగల్ జిల్లాలో ఓ తండ్రి ఆత్మహత్య

వర్దన్నపేట, వెలుగు : చిన్న కొడుకు, కోడలు వేధింపులు తట్టుకోలేక వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వరంగల్ జిల్లాలో జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు.. వర్ధన్నపేట మండలంలోని కడారిగూడెం గ్రామానికి చెందిన నాంపల్లి మల్లేశం(93) కు నలుగురు కొడుకులు, కూతురు ఉన్నారు.   చిన్న కొడుకు కోటేశ్వర్, కోడలు ఎలేంద్ర తమ పేరిట పొలం, ఇంటి స్థలం, రోడ్డుపై ఉన్న రూమ్ రాసి ఇవ్వాలని మల్లేశంను నిత్యం వేధిస్తున్నారు.  

బతికి ఏం లాభంలేదని, పురుగుల మందు తాగి చనిపోవాలని మరోసారి తీవ్రంగా వేధించి ఒత్తిడికి గురిచేశారు. దీంతో మల్లేశం ఆదివారం ఉదయం గడ్డి మందు తాగాడు. అతడిని వెంటనే రెండో కొడుకు చంద్రమౌళి 108లో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయిస్తుండగా అదేరోజు రాత్రి చనిపోయాడు. ఆస్తి కోసం వేధించడంతోనే తమ తండ్రి చనిపోయాడని మృతుడి కుమార్తె అమరావతి విజయ  ఫిర్యాదు చేయగా వర్ధన్నపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.