
- నిజామాబాద్ జిల్లా జల్లపల్లి ఫారంలో ఘటన
కోటగిరి, వెలుగు: తల్లి వద్ద ఉన్న డబ్బులు, నగల కోసం కొడుకు హత్య చేసిన ఘటన నిజామాబాద్ జిల్లాలో ఆలస్యంగా తెలిసింది. కోటగిరి ఎస్ఐ సందీప్, స్థానికులు తెలిపిన ప్రకారం.. కోటగిరి మండలం జల్లపల్లి ఫారం గ్రామానికి చెందిన నేనావత్ మంగ్లీ(72) గత ఆదివారం నుంచి కనిపించకపోవడంతో కుటుంబీకులు స్థానికంగా వెతికారు. అయినా ఫలితం లేకపోగా బంధువుల వద్దకు వెళ్లి ఉండొచ్చని భావించారు. మంగళవారం గ్రామ శివారులోని నీటి కుంటలో ఆమె డెడ్ బాడీ కనిపించడంతో స్థానికులు చూసి పోలీసులకు తెలిపారు.
తల్లి కనిపించకపోయినా స్పందించకుండా ఉన్న ఆమె రెండో కొడుకు నేనావత్ రాములుపై కుటుంబసభ్యులు అనుమానంతో నిలదీశారు. తల్లి వద్ద ఉన్న రూ.16 వేలు, నగల కోసం తనే చంపినట్టు రాములు ఒప్పుకున్నాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు. తల్లి డబ్బులు ఇవ్వకపోయే సరికి నీటి కుంట వద్దకు తీసుకెళ్లి చంపేసి అందులో పడేసి ఆత్మహత్యగా చూపేందుకు ప్రయత్నించాడని మృతురాలి పెద్ద కుమారుడు నేనావత్ ముకుంద్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు