చెన్నై: క్యాన్సర్‌తో బాధపడుతున్న తన తల్లికి ట్రీట్మెంట్ సరిగా ఇవ్వలేదన్న కోపంతో కొడుకు ప్రభుత్వ డాక్టర్‌పై దాడికి పాల్పడ్డాడు. తల్లి ఆరోగ్య పరిస్థితి గురించి మాట్లాడేందుకని వెళ్లి ఆస్పత్రిలోనే డాక్టర్‌ను కత్తితో పొడిచాడు. ఏడుసార్లు పొడిచి పారిపోతుండగా తోటి డాక్టర్లు, సిబ్బంది నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తమిళనాడు చెన్నైలోని ప్రభుత్వ ఆస్పత్రిలో బుధవారం ఈ దారుణం జరిగింది.
తల్లి ఆరోగ్యం మెరుగవలేదనే కోపంతో..
పెరుంగళత్తూర్కు చెందిన విఘ్నేశ్వరన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న తన తల్లి ప్రేమను చెన్నైలోని కలైంజర్ సెంటినరీ సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రిలో చేర్పించాడు. అంకాలజీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న డాక్టర్ బాలాజీ జగన్నాథన్ ఆమెకు ఆరు నెలలుగా ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అయినా, ఆమె ఆరోగ్యం ఏమాత్రం మెరుగుపడలేదు. దీంతో ప్రేమ కొడుకు విఘ్నేశ్వరన్ తీవ్ర అసహనానికి లోనయ్యాడు. తల్లి ఆరోగ్యం గురించి మాట్లాడాలని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్లి కత్తితో దాడి చేశాడు. విఘ్నేశ్వరన్‌ను సెక్యూరిటీ సిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించారు. డాక్టర్ బాలాజీ కడుపు, ఛాతీ, ముఖం, వీపుపై కత్తిపోట్లున్నాయని, ఐసీయూలో ట్రీట్మెంట్ అందజేస్తున్నారని హెల్త్ మినిస్టర్ సుబ్రమణియన్ మీడియాకు తెలిపారు. డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ దాడి జరిగిన స్పాట్‌ను పరిశీలించారు.
విచారణకు ఆదేశించిన సీఎం స్టాలిన్
దాడి ఘటనపై రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్ విచారణకు ఆదేశించారు. నిత్యం సేవలందిస్తున్న డాక్టర్లపై ఇలాంటి దాడులు మరోసారి జరకుండా చూస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.