
- ఆస్తి పంచాలని కొన్ని రోజులుగా పేరెంట్స్‌తో గొడవ
- తల్లి బెడ్‌రూమ్‌లోకెళ్లి కత్తితో విచక్షణారహితంగా దాడి
- 9 చోట్ల పొడవడంతో తీవ్ర రక్తస్రావం.. చికిత్స పొందుతూ మృతి
- సంగారెడ్డి జిల్లాలో ఘటన
రామచంద్రాపురం, వెలుగు: మద్యం, డ్రగ్స్‌కు బానిసైన యువకుడు.. ఆస్తి పంచి ఇవ్వాలంటూ గొడవపడి తన తల్లిని కత్తితో పొడిచి చంపేసిండు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌లో జరిగిందని పోలీసులు తెలిపారు. తెల్లాపూర్‌కు చెందిన నవారి మల్లారెడ్డి, రాధిక దంపతులకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు సుధీర్ రెడ్డికి నిరుడు నవంబర్‌లో పెండ్లి జరిగింది. చిన్న కొడుకు కార్తీక్ రెడ్డి ఏం పని చేయకుండా డ్రగ్స్, మద్యానికి బానిసై కుటుంబ సభ్యులను వేధిస్తుండేవాడు. వీళ్లంతా దివినో విల్లాస్‌లో నివాసం ఉంటున్నారు.
కార్తీక్ రెడ్డిని సుధీర్ పెండ్లికి ముందు కోయంబత్తూర్‌లోని రిహాబిలిటేషన్ సెంటర్లో అడ్మిట్ చేశారు. 2 నెలల కింద తిరిగొచ్చిన కార్తీక్ రెడ్డి.. ఆస్తులు పంచాలని తల్లిదండ్రులతో గొడవపడ్తున్నాడు. ఆదివారం రాత్రి కూడా తల్లి రాధికతో ఆస్తి విషయమై గొడవ పెట్టుకున్నాడు. ఆస్తి పంచి ఇవ్వకపోతే అందరినీ చంపేస్తానని బెదిరించాడు. గొడవ తర్వాత అందరూ ఎవరి గదుల్లో వాళ్లు పడుకున్నారు.
సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు తల్లి రాధిక బెడ్రూమ్లోకి వెళ్లిన కార్తీక్.. తన వెంట తెచ్చుకున్న కత్తితో దాడి చేశాడు. మొత్తం 9 చోట్ల పొడవడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. స్థానికుల సహకారంతో కుటుంబ సభ్యులు రాధికను నల్లగండ్లలోని సిటిజన్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ రాధిక (52) చికిత్స పొందుతూ ఉదయం 11 గంటలకు చనిపోయింది. సమాచారం అందుకున్న కొల్లూరు సీఐ రవీందర్.. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతురాలి భర్త మల్లారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తల్లిని హత్య చేసిన కార్తీక్ పరారీలో ఉన్నాడని, త్వరలోనే పట్టుకుంటామని సీఐ తెలిపారు.