ఆస్తి కోసం తండ్రిపై దాడి చేయించిన కొడుకు

ఆస్తి కోసం తండ్రిపై దాడి చేయించిన కొడుకు
  • నాకు ప్రాణహాని ఉంది..రక్షించండి 
  • డీజీపీకి ఫిర్యాదు చేసిన బాధితుడు కళ్లెం నర్సింహారెడ్డి

బషీర్ బాగ్, వెలుగు: “ఆస్తి కోసం కన్న కొడుకే దాడి చేయించాడు. కోడలు, బంధువుల నుంచి ప్రాణహాని ఉంది.  రక్షణ కల్పించండి”.. అంటూ  బాధితుడైన వృద్ధుడు రాష్ట్ర డీజీపీని కలిసి వాపోయాడు. దోమలగూడకు చెందిన  కళ్లెం నర్సింహారెడ్డి కొడుకు చంద్రశేఖర్ రెడ్డి, కోడలు పద్మలత ఆస్తి కోసం దాడి చేయించారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. 

శుక్రవారం బషీర్ బాగ్ లో బాధితుడు నర్సింహారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తన కోడలికి వరుసగా బావ అయిన కొంపల్లికి చెందిన ఎస్ వీఆర్ గార్డెన్స్ ఓనర్ సాదా నర్సింహారెడ్డి  కుటుంబం గత ఆదివారం గెట్ టూ గెదర్ పార్టీకి తనను పిలిచారని చెప్పాడు. అక్కడ ఎమ్మెల్యే మల్లారెడ్డితో పాటు మరోపది మంది పెద్దల సమక్షంలో తనను తీవ్రంగా దూషిస్తూ సాద నర్సింహారెడ్డి దాడి చేసి చితకబాదాడని,  దీంతో రెండు రోజులు అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందానని చెప్పారు. 

తన కొడుకు, కోడలకు ఆస్తి ఇస్తానని చెప్పినా కూడా వినకుండా అకారణంగా దాడి చేసి బెదిరించాడని వాపోయాడు. కొడుకు, కోడలు, సాదా నర్సింహారెడ్డి నుంచి ప్రాణహాని ఉందని తనకు రక్షణ కల్పించేలా పోలీసులు, ప్రభుత్వం చర్యలు తీసుకొని న్యాయం చేయాలని కళ్లెం నర్సింహా రెడ్డి కోరాడు.