నమిలిగొండలో బాగోగులు చూడలేదంటూ తల్లిని చంపిన కొడుకు

 నమిలిగొండలో బాగోగులు చూడలేదంటూ తల్లిని చంపిన కొడుకు
  • జనగామ జిల్లా నమిలిగొండ గ్రామంలో దారుణం

స్టేషన్‌‌‌‌‌‌‌‌ఘన్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌, వెలుగు : తన బాగోగులు పట్టించుకోలేదంటూ ఓ వ్యక్తి ఇనుపరాడ్‌‌‌‌‌‌‌‌తో తల్లిపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ ఆమె స్పాట్‌‌‌‌‌‌‌‌లోనే చనిపోయింది. ఈ ఘటన జనగామ జిల్లా స్టేషన్‌‌‌‌‌‌‌‌ఘన్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌ మండలం నమిలిగొండ గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నమిలిగొండకు చెందిన సముద్రాల మల్లయ్య, లక్ష్మి (65)కి ఇద్దరు కొడుకులు, ముగ్గురు కుమార్తెలు ఉండగా అందరికీ పెండ్లిళ్లు అయ్యాయి. మల్లయ్య ఆరేండ్ల కింద చనిపోయాడు. పెద్దకొడుకు రాజు భార్యాపిల్లలతో గ్రామంలోనే ఉంటుండగా లక్ష్మి కూడా రాజు ఇంట్లోనే ఓ గదిలో ఉంటూ కూలీ పనులు చేసుకుంటోంది. 

చిన్న కొడుకు సతీశ్‌‌‌‌‌‌‌‌ తన కుటుంబంతో కాజీపేటలో ఉంటున్నాడు. సతీశ్‌‌‌‌‌‌‌‌ మూడేండ్ల కింద రోడ్డు ప్రమాదానికి గురి కావడంతో తలకు తీవ్రగాయాలు అయ్యాయి. అప్పటి నుంచి తరచూ ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ తీసుకోవాల్సి వస్తోంది. సతీశ్‌‌‌‌‌‌‌‌ తన భార్య మమతతో కలిసి శుక్రవారం మధ్యాహ్నం నమిలిగొండకు వచ్చాడు. సాయంత్రం మమత కాజీపేటకు వెళ్లిపోగా సతీశ్‌‌‌‌‌‌‌‌ మాత్రం తల్లి వద్దే ఉన్నాడు. అర్ధరాత్రి టైంలో సతీశ్‌‌‌‌‌‌‌‌ ‘నేను రోడ్డు ప్రమాదంలో గాయపడితే బాగోగులు చూసుకున్నావా ? ఆర్థికంగా ఆదుకున్నావా ?’ అంటూ తల్లితో గొడవ పడ్డాడు.

 అనంతరం ఆగ్రహానికి గురై ఇనుపరాడ్‌‌‌‌‌‌‌‌తో లక్ష్మిపై దాడి చేయగా తీవ్రంగా గాయపడ్డ ఆమె స్పాట్‌‌‌‌‌‌‌‌లోనే చనిపోయింది. అరుపులు విన్న పెద్ద కొడుకు రాజు తల్లి గదిలోకి వచ్చి చూడగా ఆమె చనిపోయి కనిపించగా, సతీశ్‌‌‌‌‌‌‌‌ రాజును సైతం చంపుతానని బెదిరించాడు. దీంతో రాజు బయటకు పరుగెత్తి స్థానికులతో పాటు, పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. సతీశ్‌‌‌‌‌‌‌‌ను అరెస్ట్‌‌‌‌‌‌‌‌ చేసి, మృతురాలి బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ వేణు తెలిపారు.