ఆస్తి గొడవలో తండ్రిని చంపిండు

కరీంనగర్‌ క్రైం:  కరీంనగర్​ జ్యోతినగర్​లో ఆస్తి గొడవల్లో  తండ్రిని  ఓ కొడుకు  హత్య చేశాడు.  టూటౌన్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దయ్యాల శ్రీనివాస్‌(50) అనే వ్యక్తికి భార్య గంగ,  కొడుకు హరీశ్​ ఉన్నారు.   భర్తతో  మనస్పర్థలు రావడంతో  గంగ 20 ఏండ్ల నుంచి అతడికి దూరంగా ఉంటోంది.   వీరిద్దరి మధ్య ఆస్తి  గొడవలు రావడంతో  రెండేండ్ల కింద పెద్దల సమక్షంలో పంచాయితీ జరిగింది.  

అప్పటి నుంచి  కరీంనగర్‌లోనే   శ్రీనివాస్‌ ఉంటున్న  ఇంటికి  దగ్గరలోని  ఓ ఇంట్లో  భార్య గంగ, కొడుకు హరీశ్​ ఉంటున్నారు.  ఈమధ్య తండ్రి, కొడుకుల మధ్య ఆస్తి వివాదం మళ్లీ ముదిరింది.  భార్య , కొడుకు ఉంటున్న ఇంటికి  శ్రీనివాస్‌ తాళం వేయడంతో సోమవారం రాత్రి గొడవ  జరిగింది.  ఈ గొడవలో ఇద్దరు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.  హరీశ్​  తండ్రి శ్రీనివాస్‌ను నెట్టివేయడంతో  తలకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే హరీశ్​ టూటౌన్‌ పోలీసుస్టేషన్‌కు వెళ్లి  గొడవ గురించి ఫిర్యాదు చేశాడు. పోలీసులు వచ్చి ఇంటి తలుపు తీసేసరికి శ్రీనివాస్​ చనిపోయాడు. ఈ విషయంపై మృతుడి తండ్రి మల్లయ్య  పోలీసులకు  ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.