తండ్రిని కొట్టి చంపిన కసాయి కొడుకు

  • నల్గొండ జిల్లాలో దారుణం

హాలియా, వెలుగు: కని, పెంచి పెద్దచేసిన తండ్రిని కొడుకు కసాయిలా మారి రాయితో అతి దారుణంగా కొట్టి చంపాడు. ఈ హృదయవిదారక ఘటన నల్గొండ జిల్లా పెద్దవూర మండలం పోతునూరు గ్రామంలో గురువారం జరిగింది. పెద్దవూర ఎసై అజ్మీర రమేష్​ తెలిపిన వివరాల ప్రకారం.. పోతునూరు గ్రామానికి చెందిన బొడ్డు రాజబాబు లారీడ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఆయన ఐదు సంవత్సరాల క్రితం తన భార్యతో గొడవపడి, భార్యాపిల్లలను వదిలేసి తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. రాజబాబు తరచూ పేరెంట్స్ తో గొడవపడుతూ వారిని ఇబ్బంది పెడుతున్నాడు.

బుధవారం ఉదయం 11 గంటల సమయంలో తండ్రి వెంకటయ్య (55) తో గొడవపడ్డాడు. ఈ క్రమంలో వెంకటయ్య తలపై రాయితో  కొట్టాడు. అంతేకాకుండా వెంకటయ్యను రెండుసార్లు పైకి లేపి కింద సిమెంట్ రోడ్డు పై పడివేయడం తో ఆయన తలకు బలమైన గాయాలయ్యాయి. దీంతో ఆయన సృహ తప్పి పడిపోయాడు. బాధితుడిని వెంటనే స్థానికులు నాగార్జున సాగర్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
 మైరుగైన వైద్యం కోసం వెంకటయ్యను హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీలో చికిత్స పొందుతూ బాధితుడు చనిపోయాడు. మృతుడి భార్య వెంకటమ్మ ఫిర్యాదు మేరకు ఎస్సై రమేశ్​ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.