అంధ తల్లిదండ్రుల ముందు కొడుకు డెడ్​బాడీ.!చూపులేక గుర్తించని వృద్ధులు

అంధ తల్లిదండ్రుల ముందు  కొడుకు డెడ్​బాడీ.!చూపులేక గుర్తించని వృద్ధులు

 

  • దుర్వాసన రావడంతో వచ్చి చూసిన స్థానికులు
  • దంపతులకు అన్నం పెట్టి చేరదీసిన పోలీసులు
  • హైదరాబాద్​ ఎల్బీ నగర్​లో ఘటన

ఎల్​బీ నగర్, వెలుగు: కండ్లముందే కొడుకు మృతదేహమున్నా చూడలేని దైన్యం వారిది. తిండి పెట్టేవారు లేక ఆకలితో అలమటిస్తూ.. 3 రోజులుగా మృతదేహంతోనే జీవనం సాగించారు. దుర్వాసన రావడంతో స్థానికులు వచ్చి చూడగా.. కొడుకు శవం ముందే అంధ తల్లిదండ్రులు బిక్కుబిక్కుమంటూ కనిపించారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించగా.. వారు వచ్చి ఆ దంపతులకు అన్నం పెట్టి, అక్కున చేర్చుకున్నారు. హైదరాబాద్​ నాగోల్ డివిజన్ పరిధిలోని జైపురికాలనీ బ్లైండ్ కాలనీలో  ఈ దయనీయ ఘటన జరిగింది. వివరాల్లోకెళితే..  రమణ(65), శాంతకుమారి(60) వృద్ధ అంధ దంపతులు. వీరికి  ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు ప్రదీప్ తన కుటుంబంతో వేరేచోట ఉంటున్నాడు. చిన్న కొడుకు ప్రమోద్ పెండ్లి చేసుకున్నా.. వివాదాలతో భార్య వదిలిపెట్టింది. దీంతో ప్రమోద్ తల్లిదండ్రుల వద్దే ఉంటున్నాడు. మద్యానికి బానిసయ్యాడు.  3 రోజుల క్రితం ఇంట్లోనే అకస్మాత్తుగా మృతి చెందాడు. కొడుకు మృతి చెందిన విషయం తెలియక అంధులైన తల్లిదండ్రులు మృతదేహంతోనే ఉంటున్నారు. 

కొడుకు ఎక్కడికో వెళ్లాడని భావించిన వారు ఆకలితో అలమటిస్తూ ఇంట్లోనే ఉండిపోయారు. మృతదేహం కుళ్లిపోవడంతో దుర్వాసన రాగా.. స్థానికులు ఇంట్లోకి వచ్చి చూశారు. మృతదేహం ముందే ఉన్న అంధ వృద్ధులను చూసి చలించిపోయారు. నాగోల్​ పోలీసులకు సమాచారం అందించారు. నాగోల్ సీఐ సూర్యానాయక్, ఎస్సై శివనాగప్రసాద్​తో పాటు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, పరిశీలించారు.  మృతదేహం పక్కనే దుర్వాసన భరిస్తూ ఆకలితో అలమటిస్తున్న వృద్ధులను బయటకు తీసుకుని వచ్చి స్నానం చేయించి, భోజనం పెట్టించారు. అనంతరం వారితో మాట్లాడి.. కుటుంబ వివరాలు తెలుసుకున్నారు. చిన్న కొడుకు ప్రమోద్ మృతి చెందిన విషయాన్ని చెప్పి, మృతదేహాన్ని ఉస్మానియా దవాఖానకు తరలించారు. పెద్ద కొడుకు  ప్రదీప్ కు సమాచారం ఇచ్చి, అక్కడికి రప్పించారు. ప్రదీప్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు నాగోల్  సీఐ సూర్యానాయక్ తెలిపారు.