చెల్లెకు ఇల్లు రాసిచ్చాడని.. తండ్రికి తలకొరివి పెట్టని కొడుకు

చెల్లెకు ఇల్లు రాసిచ్చాడని.. తండ్రికి తలకొరివి పెట్టని కొడుకు
  • ఇంటిని తిరిగి ఇస్తామని బతిమిలాడినా అంత్యక్రియలకు రాలేదు 
     
  • తండ్రి చితికి నిప్పు పెట్టిన చిన్న బిడ్డ.. మహబూబ్‌నగర్‌‌లో ఘటన
  • కొడుకుకు 15 ఎకరాలతో పాటు 60 లక్షల క్యాష్ ఇచ్చిన తండ్రి 
  • అయినా ఇల్లు ఇవ్వలేదంటూ తండ్రిపై కోపం పెంచుకున్న కొడుకు

మహబూబ్‌‌నగర్, వెలుగు: చెల్లెకు ఇల్లు రాసిచ్చాడని తండ్రిపై కోపం పెంచుకున్న ఓ కొడుకు.. తండ్రి అనారోగ్యంతో చనిపోతే కడసారి చూపు చూడడానికి కూడా రాలేదు. ‘ఇల్లు నాకు కాకుండా చేశాడు. నేను అంత్యక్రియలకు రాను’ అని తెగేసి చెప్పాడు. ఇల్లు ఆయన పేరుపై రాస్తామని ఇద్దరు చెల్లెళ్లు బతిమిలాడినా, బంధుమిత్రులు ఒప్పించే ప్రయత్నం చేసినా అతను వినలేదు. దీంతో చేసేదేంలేక చివరకు చిన్న కుమార్తెనే తండ్రి చితికి అగ్గిపెట్టి, అంత్యక్రియలు పూర్తి చేసింది. ఈ ఘటన మహబూబ్‌‌నగర్​జిల్లా కేంద్రంలో బుధవారం జరిగింది.  

తండ్రిపై కోపం పెంచుకుని.. 

నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం క్యాతన్‌‌పల్లి గ్రామానికి చెందిన మాణిక్యరావు (80), సురేఖ భార్యాభర్తలు. వీరికి గిరీశ్, కవిత, రఘునందిని సంతానం. మాణిక్యరావు సర్వే అండ్​ల్యాండ్స్​ రికార్డ్స్​ డిపార్ట్‌‌మెంట్‌‌లో అసిస్టెంట్​డైరెక్టర్‌‌‌‌గా రిటైర్​అయ్యారు. ఇతర ప్రాంతాల్లో డ్యూటీ కావడంతో సొంతూరు వదిలి దాదాపు 25 ఏండ్లుగా మహబూబ్‌‌నగర్‌‌‌‌లోనే  నివాసం ఉంటున్నారు. కొడుకు, కూతుళ్లకు లగ్గాలు చేశారు. కొడుకు హైదరాబాద్‌‌లో ఉంటుండగా, బిడ్డలు పాలమూరులోనే ఉంటున్నారు. నాలుగేండ్ల కిందట సురేఖ చనిపోయారు. మాణిక్యరావు తనకు సొంతూరులో ఉన్న 15 ఎకరాల భూమితో పాటు రూ.60 లక్షల క్యాష్‌‌ను కొడుకుకు ఇచ్చాడు. అయితే మహబూబ్‌‌నగర్‌‌‌‌లోని పద్మావతి కాలనీలో సొంత ఇల్లు ఉండగా.. చిన్న కూతురు రఘునందిని ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటంతో, ఆ ఇంటిని ఆమె పేరిట రిజిస్ట్రేషన్ చేశాడు. ఇది గిరీశ్‌‌కు నచ్చలేదు. లక్షల విలువ చేసే ఇంటిని చెల్లెకు ఇచ్చాడని తండ్రిపై కోపం పెంచుకున్నాడు. 

ఇంటిని ఇస్తామన్నా రాలే.. 

మహబూబ్‌‌నగర్‌‌‌‌లోని ఇంటిలోనే మాణిక్యరావు, ఆయన చిన్న కూతురు రఘునందిని కుటుంబం ఉంటున్నది. అయితే మంగళవారం రాత్రి మాణిక్యరావు అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ విషయాన్ని హైదరాబాద్‌‌లో ఉన్న గిరీశ్‌‌కు చెల్లెళ్లు ఫోన్​చేసి చెప్పారు. అయితే ‘ఇంటిని నాకు కాకుండా చేశాడు. నేను అంత్యక్రియలకు రాను’ అని గిరీశ్​ తేల్చి చెప్పాడు. దీంతో చెల్లెళ్లు అన్నను బతిమిలాడారు. ఇంటిని ముగ్గురం సమానంగా పంచుకుందామని, అవసరమైతే ఆయనకే పూర్తిగా ఇస్తామని, అంత్యక్రియలకు రావాలని వేడుకున్నారు. అయినా గిరీశ్ మనసు కరగలేదు. బంధుమిత్రులు చెప్పినా ఆయన వినిపించుకోలేదు. కాగా, అప్పటికే అక్కడికి చేరుకున్న సీనియర్ సిటిజన్ ఫోరం సభ్యులు ‘మీరు అంత్యక్రియలు నిర్వహించకుంటే.. మేం నిర్వహిస్తం’ అని ముందుకొచ్చారు. గిరీశ్​రాకున్నా అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులు, మిత్రులు సిద్ధమయ్యారు. దీంతో బుధవారం మధ్యాహ్నం అంతిమయాత్ర నిర్వహించగా, చిన్నకూతురు రఘునందిని తండ్రికి తలకొరివి పెట్టారు.