జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీచేసిన ఓ అభ్యర్థికి విచిత్ర సంఘటన ఎదురైంది. తన నామినేషన్‌తో పాటు వేసిన కొడుకు డమ్మీ నామినేషనే తన ఓటమికి కారణమవుతుందని ఆ అభ్యర్థి ఊహించలేదు. ఈ ఘటన బీఎన్ రెడ్డి నగర్ డివిజన్‌లో జరిగింది. ఈ డివిజన్ నుంచి టీఆర్ఎస్ తరపున ముద్దగౌని లక్ష్మీ ప్రసన్న గౌడ్ పోటీచేశారు. అయితే నామినేషన్లలో ఆమె తరపున డమ్మీ అభ్యర్థిగా ఆమె కుమారుడు రంజిత్ గౌడ్ నామినేషన్ వేశాడు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియడంతో రంజిత్ గౌడ్ తన నామినేషన్ విత్ డ్రా చేసుకోలేదు. దాంతో ఆయన పేరు కూడా బ్యాలెట్ పేపర్‌లో కనిపించింది. ఎలక్షన్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి రంజిత్ గౌడ్ అనుకొని 39 మంది ఓట్లు వేశారు. ఆ ఓట్లే టీఆర్ఎస్ అసలు అభ్యర్థి లక్ష్మీ ప్రసన్న ఓటమికి కారణమయ్యాయి. ఆమె 32 స్వల్ప ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ఈ డమ్మీ నామినేషన్ కలిసిరావడంతో బీజేపీ అభ్యర్థి మొద్దు లచ్చిరెడ్డి అనూహ్యంగా విజయం సాధించారు.
For More News..