అత్తమామపై అల్లుడు దాడి

అత్తమామపై అల్లుడు దాడి
  • మామ మృతి.. అత్త పరిస్థితి విషమం
  • ములుగు జిల్లా నీలాద్రిపేటలో ఘటన 

మంగపేట, వెలుగు: ములుగు జిల్లా మంగపేట మండలం బాలన్నగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని నీలాద్రిపేటలో అత్తమామలపై అల్లుడు దాడి చేయడంతో మామ చనిపోగా, అత్త పరిస్థితి విషమంగా ఉంది. నీలాద్రిపేటకు చెందిన గొర్రె నర్సయ్య,- నర్సక్కకు ముగ్గురు బిడ్డలు. రెండో కూతురు స్వప్నను17 ఏండ్ల కింద అదే గ్రామానికి చెందిన గాంధర్ల రామకృష్ణ (37)కు ఇచ్చి పెండ్లి చేశారు. వీరికి ఒక కూతురు, కొడుకు ఉన్నారు. రామకృష్ణ అదే గ్రామానికి చెందిన మరో మహిళను పెండ్లి చేసుకోవడంతో స్వప్న నాలుగేండ్లుగా రామకృష్ణకు దూరంగా అదే గ్రామంలో తల్లిదండ్రుల దగ్గర ఉంటోంది.

ఆదివారం ఉదయం గ్రామంలో ముత్యాలమ్మ తల్లికి శ్రవణం పెట్టడం కోసం గ్రామస్తులందరూ గుడి దగ్గర సమావేశమయ్యారు. మద్యం మత్తులో ఉన్న రామకృష్ణ ముత్యాలమ్మ గుడి దగ్గర స్వప్న కనబడడంతో ఆవేశంగా ఎడ్లబండి నాటు కర్రతో దాడి చేయబోయాడు. దీంతో ఆమె తల్లిదండ్రులు నర్సమ్మ,- నర్సయ్య అడ్డం రాగా వారిపై అటాక్ ​చేశాడు. తీవ్రంగా గాయపడిన వారిని మంగపేట గవర్నమెంట్​హాస్పిటల్​, తర్వాత ఏటూరునాగారం సర్కారు దవాఖానకు, అక్కడి నుంచి ములుగు ఏరియా హాస్పిటల్​కు తీసుకువెళ్లారు. నర్సయ్య మార్గమధ్యలో చనిపోగా, నర్సమ్మ పరిస్థితి విషమంగా ఉంది. మృతుడి చిన్న కూతురు సౌజన్య ఫిర్యాదు మేరకు ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, సీఐ అనుముల శ్రీనివాస్, మంగపేట ఎస్సై టీవీఆర్​ సూరి సంఘటన స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.