నారాయణ్ ఖేడ్, వెలుగు: భార్యతో పాటు అత్తమామలను చంపేందుకు యత్నించిన ఒకరిని నారాయణఖేడ్ పోలీసులు అరెస్టు చేశారు. రెండేండ్లుగా తన భార్యను కాపురానికి పంపడం లేదని గొల్ల రమేశ్ తన భార్యను, అత్తమామలను చంపడానికి కుట్ర పన్నాడని నారాయణఖేడ్ సీఐ రామకృష్ణరెడ్డి, ఎస్ఐ వెంకట్ రెడ్డి చెప్పారు.
గొల్ల రమేశ్ భార్య తన భర్తతో గొడవపడి రెండేండ్లుగా తల్లిదండ్రులతో కలిసి సంజీవన్ రావుపేటలో ఉంటోంది. అప్పటి నుంచి భార్యను కాపురానికి పంపడం లేదని రమేశ్ కోపంతో ఉన్నాడు. దీంతో భార్యతో సహా అత్తమామలను చంపాలని ప్లాన్ వేశాడు. ఈనెల 12న సంజీవన్ రావుపేటలోని మామ రాములు ఇంటి తలుపులకు ఇనుపతీగ అమర్చి కరెంట్ కనెక్షన్ ఇచ్చాడు.
కరెంట్ లేక పథకం పారలేదు. తర్వాత పొలం దగ్గరికి వెళ్లి రెండు బోర్ మోటర్లను కాలబెట్టాడు. బోరులో రాళ్లు వేసి ధ్వంసం చేశాడు. విచారణలో ఇదంతా చేసింది రమేశ్ అని తేలడంతో సోమవారం కేసు నమోదు చేసి జైలుకు పంపించారు.