- తండ్రి భూమి ఇచ్చినా సంతృప్తి పడని కొడుకు
- కరీంనగర్ జిల్లా రేణిగుంటలో దారుణం
గన్నేరువరం, వెలుగు : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణిగుంటలో పొలం కోసం కన్నతల్లిని చంపేశాడో కొడుకు. పోలీసులు, కుటుంబసభ్యుల కథనం ప్రకారం..రేణిగుంటకు చెందిన తమ్మనవేని కనకవ్వ ( 56)కు కొడుకు వినోద్, ముగ్గురు బిడ్డలున్నారు. అందరికీ పెండ్లిళ్లయ్యాయి. వినోద్ వారసత్వంగా వచ్చిన ఎకరం ఇరవై గుంటల భూమిని సాగు చేసుకుంటున్నాడు.
కనకవ్వకు గన్నేరువరం మండలం జంగాపల్లి శివారులో ఆమె తండ్రి రెండెకరాల పొలం ఇవ్వగా.. కౌలుకు ఇచ్చుకొని వచ్చిన డబ్బులతో బతుకుతోంది. అయితే, ఆ భూమి తన పేరిట రిజిస్ట్రేషన్చేయాలని వినోద్ తల్లిని వేధించేవాడు. ఈ గొడవ భరించలేని ఆమె ఇటీవలే రేణిగుంటలోనే ఓ అద్దె ఇంటిలో ఉంటోంది. బుధవారం ఉదయం జంగాపల్లి శివారులోని కనకవ్వ పొలంలోకి వినోద్ సాగు చేసేందుకు వెళ్లాడు.
ఇది తెలుసుకున్న కనకవ్వ పొలం దగ్గరకు వెళ్లి వినోద్ కు అడ్డు చెప్పింది. దీంతో తన చేతిలోని పారతో కనకవ్వ తలపై గట్టిగా కొట్టడంతో తల పగిలి అక్కడికక్కడే చనిపోయింది. మృతురాలు చిన్న కూతురు కల్యాణి ఫిర్యాదు మేరకు సీఐ ఇంద్రసేనారెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.