పైసల కోసం తల్లిని కొట్టి చంపిండు

పైసల కోసం తల్లిని కొట్టి చంపిండు
  •  అరుపులు వినపడకుండా  సౌండ్ బాక్స్ పెట్టిండు

సంగారెడ్డి/హత్నూర, వెలుగు: 18 ఏళ్లు పెంచి పెద్దచేసిన తల్లిని పైసల కోసం కట్టెతో కొట్టి చంపాడో కొడుకు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం మంగాపూర్ గ్రామానికి చెందిన కొండని ఎల్లమ్మ (65), కొండని ఎల్లయ్య దంపతులకు పిల్లలు లేరు. హత్నూరకు చెందిన బంధువుల ఇంటి నుంచి 18 ఏళ్ల క్రితం ఓ పిల్లాడిని దత్తత తీసుకున్నారు. మహేందర్​ అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకున్నారు. పదేళ్ల క్రితం ఎల్లయ్య అనారోగ్యంతో చనిపోయాడు. కొంతకాలంగా మహేందర్​ వ్యసనాలకు బానిసయ్యాడు. ఇటీవల ఎల్లమ్మ తనకున్న వ్యవసాయ భూమిలో 17 గుంటలు విక్రయించింది. పొలం అమ్మగా వచ్చిన డబ్బులను ఇవ్వాలని మహేందర్ కొన్ని రోజులుగా తల్లిని వేధిస్తున్నాడు. మంగళవారం రాత్రి తల్లితో డబ్బుల విషయమై గొడవపడ్డాడు. ప్లాన్​ప్రకారం గొడవ బయటకు వినపడకుండా సౌండ్​బాక్సు పెట్టాడు. ఎల్లమ్మను కట్టెలతో తలపై కొట్టగా తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే చనిపోయింది. ఏమీ ఎరగనట్టు బయటకు వచ్చి పడుకున్నాడు. ఉదయం తల్లి లేవట్లేదని ఇరుగుపొరుగు వారికి చెప్పడంతో అనుమానం వచ్చి నాలుగు తగిలించేసరికి అసలు విషయం బయట పెట్టాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మహేందర్​ను అదుపులోకి తీసుకున్నారు. మృతురాలి చెల్లెలు మన్నెమ్మ ఫిర్యాదు మేరకు హత్నూర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.