నిజాంపేట, వెలుగు : మెదక్ జిల్లా నిజాంపేటలో మద్యానికి బానిసగా మారి.. తాగడానికి డబ్బులు లేకపోవడంతో పైసలు ఇవ్వాలంటూ తల్లితో గొడవ పడ్డాడు కొడుకు. ఆమె ఒప్పుకోకపోవడంతో గొంతు నులిమి చంపాడు. రామాయంపేట సీఐ వెంకట రాజా గౌడ్ కథనం ప్రకారం..గ్రామానికి చెందిన చల్మేటి దుర్గవ్వ (75) కొడుకు రాంచంద్రం(46) బీడీ టేకేదారుగా పని చేస్తుంటాడు.
ఇతడికి భార్య కొడుకు, బిడ్డ ఉన్నారు. పిల్లలకు పెండ్లిళ్లు కూడా అయ్యాయి. మద్యానికి బానిసైన రాంచంద్రం ఎప్పుడూ తల్లిని డబ్బుల కోసం సతాయించాడు. ఆమె తన దగ్గర లేవని ఎంత మొత్తుకున్నా వినలేదు. డబ్బులు ఉంచుకుని ఇవ్వడం లేదని అర్ధరాత్రి ఆమె పడుకున్నాక గొంతు నులిమి చంపాడు. కొద్దిసేపటికి రాంచంద్రం భార్య వచ్చి తన అత్తను లేపేందుకు ప్రయత్నించగా లేవలేదు.
దీంతో మొత్తుకోగా చుట్టుపక్కల వారు వచ్చి చూసేసరికి చనిపోయి ఉంది. గొంతుపై గాయాలుండడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి రాంచంద్రంను విచారించగా తానే చంపానని ఒప్పుకున్నాడు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.