దారుణం.. తాగొద్దని చెప్పినందుకు తల్లిని చంపిన కొడుకు

దారుణం.. తాగొద్దని చెప్పినందుకు తల్లిని చంపిన కొడుకు

కందనూలు, వెలుగు: తాగుడు మాని, ఏదైనా పని చేసుకొని బతకాలని తల్లి మందలించడంతో ఆగ్రహానికి గురైన కొడుకు ఆమెను హత్య చేశాడు. నాగర్‌‌కర్నూల్‌‌ జిల్లా బిజినేపల్లి మండలం మహదేవునిపేట గ్రామంలో రెండు రోజుల కింద జరిగిన ఈ ఘటన సోమవారం వెలుగుచూసింది. సీఐ కనకయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మహదేవునిపేట గ్రామానికి చెందిన ఉత్తయ్యకు నాగమ్మ, యాదమ్మ (55) ఇద్దరు భార్యలు. యాదమ్మకు కరుణాకర్‌‌, పరమేశ్‌‌ కుమారులు.

పరమేశ్‌‌ హైదరాబాద్‌‌లో కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తుండగా, పెద్దకొడుకు కరుణాకర్‌‌ తాగుడుకు బానిసై  గ్రామంలోనే ఉంటున్నాడు. 
ప్రతి రోజు మద్యం తాగి వచ్చి తల్లితో గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో తాగుడు మానేసి ఏదైనా పని చేసుకొని బతకాలని యాదమ్మ రెండు రోజుల కింద కొడుకును మందలించింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న కరుణాకర్‌‌ ఆగ్రహానికి గురై తల్లిని కొట్టడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. తర్వాత తల్లి డెడ్‌‌బాడీని ఇంటి పక్కన ఉన్న చెట్ల పొదల్లో వేసి చీరలు కప్పాడు. 

ఆదివారం రాత్రి ఆ ప్రాంతంలో దుర్వాసన రావడంతో చుట్టుపక్కల గ్రామస్తులు బిజినేపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనాస్థలానికి చేరుకొని డెడ్‌‌బాడీని గుర్తించి, వివరాలు సేకరించారు. అయితే తన తల్లిని అన్న కరుణాకరే హత్య చేసి ఉంటాడని అతడి తమ్ముడు పరమేశ్‌‌ అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో పోలీసులు కరుణాకర్‌‌ను అదుపులోకి తీసుకొని విచారించగా తానే చంపినట్లు ఒప్పుకున్నాడు. మృతురాలి భర్త ఉత్తయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.