పింఛన్ డబ్బుల కోసం తల్లిని చంపిన కొడుకు

పింఛన్  డబ్బుల కోసం తల్లిని చంపిన కొడుకు
  • అనాథలుగా మారిన ఇద్దరు పిల్లలు
  • నిర్మల్​ జిల్లా ముథోల్​ మండలం ఆష్టా గ్రామంలో ఘటన

ముథోల్, వెలుగు: మద్యం మత్తులో పింఛన్  డబ్బుల కోసం తల్లిని కొడుకు హత్య చేశాడు. స్థానికులు, పోలీసులు కథనం ప్రకారం.. నిర్మల్​ జిల్లా ముథోల్  మండలం ఆష్టా గ్రామానికి చెందిన నిమ్మ మీరాబాయి(75)పై కొడుకు గజ్జన్న కొడవలి, కర్రతో దాడి చేయడంతో చనిపోయింది. మృతురాలు ఈరాబాయికి ఇద్దరు కొడుకులు ఉండగా, పెద్ద కొడుకు పదేండ్ల కింద చనిపోవడంతో గజ్జన్న దగ్గర ఉంటోంది. గజ్జన్న భార్య రెండేండ్ల కింద చనిపోవడంతో, అతని పిల్లలను తన దగ్గర ఉంచుకొని కుటుంబాన్ని పోషిస్తోంది. భార్య చనిపోవడంతో గజ్జన్న తాగుడికి బానిసై తల్లిని డబ్బుల కోసం వేధించేవాడు.

 శనివారం పింఛన్  డబ్బులు రావడంతో తల్లితో గొడవపడ్డాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో కూరగాయలు కోసే కొడవలి, కర్రతో దాడి చేయడంతో మీరాబాయి అక్కడికక్కడే చనిపోయింది. గజ్జన్న పిల్లలు ఈ విషయాన్ని కాలనీవాసులకు చెప్పడంతో, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని సీఐ మల్లేశ్​ పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సంజీవ్  తెలిపారు.నానమ్మ చనిపోవడం, తండ్రిని పోలీసులు అరెస్ట్​ చేయడంతో గజన్న కొడుకు గంగాధర్(13), కూతురు పుష్ప(8) అనాథలుగా మారారు. నానమ్మ అంతక్రియలకు సైతం డబ్బులు లేకపోవడంతో గ్రామస్తులు తమకు తోచిన సాయం చేశారు. ఫించన్​ డబ్బులతో పిల్లలకు జెండా పండుగకు బట్టలు తీసుకుంటానని చెప్పినా వినకుండా నానమ్మను హత్య చేశాడని పిల్లలు వాపోయారు.