నస్రుల్లాబాద్, వెలుగు : తండ్రి చనిపోవడంతో వచ్చిన రైతు బీమా డబ్బులు తనకు ఇవ్వాలని ఓ యువకుడు తల్లిని హత్య చేశాడు.ఈ ఘటన కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలంలో దుర్కి గ్రామంలో బుధవారం జరిగింది. ఏఎస్సై వెంకట్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మెక్క అంజవ్వ (46)కు కూతురు, కొడుకు ఉన్నారు. భర్త ఏడాదిన్నర కింద చనిపోయాడు. కూతురికి వివాహం కావడంతో కొడుకు సాయి కుమార్‌తో కలిసి ఉంటుంది.
అంజవ్వ భర్త చనిపోయాక రైతు బీమా డబ్బులు వచ్చాయి. ఇందులో కొంత డబ్బును సాయికుమార్‌కు ఇచ్చి మిగిలిన వాటిని బ్యాంక్‌లో డిపాజిట్ చేసింది. ఆ డబ్బులు సైతం తనకు ఇవ్వాలని సాయికుమార్ తల్లితో నిత్యం గొడవ పడేవాడు. మంగళవారం సైతం గొడవ జరగడంతో అప్పటికే మద్యం మత్తులో ఉన్న సాయి కుమార్ ఆగ్రహానికి గురై కర్రతో తల్లిపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ అంజవ్వ అక్కడికక్కడే చనిపోయింది. గమనించిన చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.