బిడ్డకు భూమి ఇయ్యొద్దంటున్నడని..  కొడుకు హత్యకు తండ్రి సుపారి

బిడ్డకు భూమి ఇయ్యొద్దంటున్నడని..  కొడుకు హత్యకు తండ్రి సుపారి
  • మర్డర్​చేసిన మేనమామ, అతడి కొడుకు, తమ్ముడి కొడుకు  
  • నెల కింద పెట్రోల్ ​పోసి  నిప్పంటించి అడవిలో పడేసిన్రు  
  • అస్తి పంజరాన్ని పట్టుకుని మిస్టరీ చేధించిన పోలీసులు
  • భూపాలపల్లి జిల్లాలో ఘటన 

భూపాలపల్లి అర్భన్​, వెలుగు : గత నెలలో రాంపూర్ అడవిలో కాలిపోయిన స్థితిలో ఓ గుర్తు తెలియని మృతదేహం కనిపించగా ఆ కేసు మిస్టరీని పోలీసులు చేధించారు. బిడ్డకు జాగా ఇస్తా అంటే వేధిస్తున్నాడనే కోపంతో కన్న తండ్రే..తన బావమరిది, వారి కొడుకులతో ఈ హత్య చేయించినట్టు పోలీసులు తేల్చారు. భూపాలపల్లి డీఎస్పీ సంపత్​రావు, సీఐ నరేశ్​కుమార్​ కథనం ప్రకారం...గురువారం సాయంత్రం ఎస్సై ప్రసాద్, సిబ్బంది 5వ ఇంక్లైన్ ఆర్చ్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ ఆటోలో వస్తున్న ముగ్గురు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశారు.

వారిని పట్టుకుని విచారించగా నెల రోజుల కింద చేసిన మర్డర్ ​విషయం బయటపెట్టారు. వర్ధన్నపేట మండలం రాంధాన్​తండాకు చెందిన నరసింహ స్వామి దంపతులకు కొడుకు గూగులోత్​ ప్రభాకర్(29)తో పాటు కూతురు ఉంది. గూగులోత్ ​నరసింహస్వామి తన బిడ్డకు 20 గుంటల భూమి పంచుతానని అనగా ప్రభాకర్ ఒప్పుకోలేదు. ఒకవేళ భూమి ఇస్తే తల్లిదండ్రులను చంపుతానని బెదిరిస్తున్నాడు.

ఈ విషయంలో చాలాసార్లు చేయి కూడా చేసుకున్నాడు. దీంతో తన కొడుకుతో తనకు ముప్పు ఉందని గ్రహించిన నరసింహ స్వామి..ప్రభాకర్​ను చంపితే రూ.50వేలు ఇస్తానని పర్వతగిరి మండలం తురకల సోమవారం గ్రామానికి చెందిన తన బావమరిది బానోత్ బాలాజీ(38)కి చెప్పాడు. దీనికి ఒప్పుకున్న అతడు తన కొడుకు సిద్దు(20), తమ్ముడి కొడుకు శీను(20)తో కలిసి పథకం పన్నాడు. ముగ్గురూ కలిసి ప్రభాకర్​కు భూపాలపల్లి మండలం గొల్ల బుద్ధారం తండాలో పెండ్లి సంబంధం చూశామని చెప్పారు. ఏప్రిల్23న గొల్ల బుద్ధారం తండాకు బైక్​లపై వెళ్లారు.

మార్గమధ్యలోని రాంపూర్ అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి మద్యం తాగించారు.  తర్వాత తలపై బండరాయితో  కొట్టి చంపారు. వెంట తెచ్చుకున్న పెట్రోల్​పోసి నిప్పంటించి పారిపోయారు. ఏప్రిల్​29న తల్లిదండ్రులు తమ కొడుకు కనిపించకుండాపోయారని మిస్సింగ్​ కేసు పెట్టారు. కొద్ది రోజుల తర్వాత ఓ బర్ల కాపరి రాంపూర్​ అడవిలోకి వెళ్లగా అస్తి పంజరం కనిపించింది. దీంతో వారు పోలీసులకు సమాచారమిచ్చారు.

ఒంటిపై ఉన్న బట్టల ఆధారంగా పోలీసులు వాట్సాప్ ​గ్రూపుల్లో ఇతర చోట్ల మృతదేహాన్ని గుర్తిస్తే సమాచారం ఇవ్వాలని ప్రచారం చేశారు. మృతుడు నివాసముండే ప్రాంతంలో కూడా మిస్సింగ్​ కేసు నమోదు కావడంతో అన్ని ఆధారాలు పరిశీలించి అస్తి పంజరం ప్రభాకర్​దిగా గుర్తించారు. గురువారం చేసిన తనిఖీల్లో నిందితులు తామే హత్య చేశామని ఒప్పుకోవడంతో ముగ్గురిని అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.